హైదరాబాద్‌లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయం.. DNA పరీక్షల్లో షాకింగ్ నిజం బయటపడింది!

హైదరాబాద్‌లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయించిన ఘటనలో DNA పరీక్షలు కీలక నిజాన్ని బయటపెట్టాయి. మటన్‌గా విక్రయిస్తున్న మాంసంలో గేదె దూడ మాంసం కలిపినట్లు నిర్ధారణ కావడంతో దుకాణ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. అధికారులు ప్రజలు లైసెన్స్ ఉన్న విశ్వసనీయ దుకాణాల నుంచే మాంసం కొనుగోలు చేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో మటన్ పేరుతో కల్తీ మాంసం విక్రయం.. DNA పరీక్షల్లో షాకింగ్ నిజం బయటపడింది!
Hyderabad Mutton News

Edited By:

Updated on: Jul 18, 2026 | 1:39 PM

Hyderabad Meat Adulteration: హైదరాబాద్‌లో మటన్ పేరుతో కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల స్వాధీనం చేసుకున్న మాంసం నమూనాలపై నిర్వహించిన DNA పరీక్షల్లో అవి స్వచ్ఛమైన మేక మాంసం (మటన్) కాదని, అందులో గేదె దూడ మాంసం కలిపినట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. జూలై 1న హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి బడా మసీదు సమీపంలో ఉన్న ఓ మాంసం దుకాణంపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), GHMC వెటర్నరీ విభాగం, హబీబ్‌నగర్ పోలీసులు, CCS అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టిన అధికారులు.. దుకాణంలో ఉన్న సుమారు 50 కిలోల అనుమానాస్పద మాంసాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం పంపించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ICAR–నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో DNA పరీక్షలకు పంపగా, మటన్‌గా విక్రయిస్తున్న మాంసంలో గేదె దూడ మాంసం ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది.

DNA నివేదిక ఆధారంగా దుకాణ యజమానిపై పోలీసులు మోసం, ఆహార కల్తీకి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. త్వరలోనే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆహారంలో కల్తీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు మాంసాన్ని కొనుగోలు చేసే సమయంలో లైసెన్స్ ఉన్న, విశ్వసనీయ దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని, అనుమానం కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే, ఈ ఘటన ఒక్క దుకాణానికి మాత్రమే సంబంధించినది. హైదరాబాద్‌లోని అన్ని మాంసం దుకాణాల్లో ఇదే పరిస్థితి ఉందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Follow Us