హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌కు ఐటీ శాఖ షాక్.. భారీ అపార్ట్‌మెంట్ అటాచ్!

హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కుటుంబానికి చెందిన ఆస్తి వ్యవహారంలో ఐటీ శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాయదుర్గంలోని భారీ అపార్ట్‌మెంట్‌ను బినామీ ఆస్తిగా అనుమానిస్తూ తాత్కాలికంగా అటాచ్ చేసింది. భవనం కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన నిధులు, అద్దె ఆదాయం మరో వ్యక్తి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించింది.

హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌కు ఐటీ శాఖ షాక్.. భారీ అపార్ట్‌మెంట్ అటాచ్!
Yadagiri Chinna Goud

Updated on: Nov 23, 2026 | 12:48 PM

బంగారం ఆభరణాలతో తరచూ వార్తల్లో కనిపించే హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌ యాదగిరి చిన్న గౌడ్‌ అలియాస్‌ దర్గా చిన్న పహిల్వాన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారంలో బినామీ నిరోధక విభాగం కీలక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌ భవనాన్ని తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. ఈ ఆస్తి కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై జరిపిన విచారణలో పలు వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

రాయదుర్గంలోని నవ ఖల్సా గ్రామంలో 222 చదరపు గజాల స్థలాన్ని 2019 జూలైలో కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో దీని విలువ రూ.26.70 లక్షలుగా ఉంది. ఇందులో రూ.1.70 లక్షలు నగదు రూపంలో, మిగిలిన రూ.25 లక్షలు మూడు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించారు. అయితే ఈ డబ్బును తానే సమకూర్చలేదని, తన బావ ఇచ్చినట్లు ప్రణయ్ గౌడ్ విచారణలో వెల్లడించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

ఆ స్థలంలో అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తులో రెండు చొప్పున మొత్తం 2-బీహెచ్‌కే ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. నిర్మాణ వ్యయాన్ని కూడా తన బావే భరించినట్లు ప్రణయ్ గౌడ్ వాంగ్మూలంలో పేర్కొన్నారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇందుకోసం డెవలపర్లకు చెల్లింపులు జరిపేందుకు తనఖా రుణం తీసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక అంశం ఉంది. భవనం ప్రణయ్ గౌడ్ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, ఆస్తి కొనుగోలు సమయంలో ఆయన విద్యార్థిగా ఉన్నారు. అప్పట్లో తనకు పన్ను చెల్లించదగిన ఆదాయం లేదని విచారణలో చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా, అంతటి విలువైన స్థలం కొనుగోలు చేసి భవనం నిర్మించే ఆర్థిక సామర్థ్యం తనకు ఉందని నిరూపించే ఆధారాలను సమర్పించలేకపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆస్తికి డబ్బు సమకూర్చిన వ్యక్తే అసలు లబ్ధిదారుడై ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ అపార్ట్‌మెంట్ ద్వారా వస్తున్న అద్దె ఆదాయం కూడా దర్యాప్తులో అధికారుల దృష్టిని ఆకర్షించింది. భవనంలోని ఫ్లాట్ల ద్వారా నెలకు సుమారు రూ.3.20 లక్షల అద్దె లభిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ మొత్తం ఆస్తి యజమానిగా రికార్డుల్లో ఉన్న ప్రణయ్ గౌడ్ ఖాతాలోకి వెళ్లడం లేదు. ఆయన బావ భార్యకు చెందిన సిటీ యూనియన్ బ్యాంకు ఖాతాలోకి అద్దె సొమ్ము జమ అవుతున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఆమె భర్త బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ అయినట్లు లావాదేవీలను పరిశీలించి నిర్ధారించినట్లు సమాచారం.

ఈ ఆధారాల నేపథ్యంలో ప్రణయ్ గౌడ్‌ను బినామీదారుడిగా, ఆయన బావను ఆస్తికి అసలు లబ్ధిదారుడిగా పేర్కొంటూ బినామీ నిరోధక విభాగం చర్యలు తీసుకుంది. ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ నవంబర్ 17న తాత్కాలిక అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం-1988లోని సెక్షన్ 24(4)(a) కింద ఈ చర్యలు చేపట్టారు.

దీంతో రాయదుర్గంలోని ఈ అపార్ట్‌మెంట్‌ను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చినట్లు సమాచారం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భవనాన్ని విక్రయించడం, ఇతరులకు బదిలీ చేయడం లేదా యాజమాన్య హక్కులను మార్చడం సాధ్యం కాదు. అద్దె ఆదాయంపైనా ఆంక్షలు విధించారు. ఆస్తి వాస్తవ యాజమాన్యంపై తుది నిర్ణయం వెలువడే వరకు ఈ తాత్కాలిక అటాచ్‌మెంట్ కొనసాగనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us