ఐవీఎఫ్‌ కేంద్రాల వేదికగా అండాల అక్రమ సేకరణ.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు

హైదరాబాద్‌ వేదికగా అక్రమంగా అండాలను సేకరిస్తున్న కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఈ కేసులో కీలక నిందితుడైన అమిత్‌ శర్మతో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే వారి నుంచి దాదాపు 43 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను రక్షించారు.

ఐవీఎఫ్‌ కేంద్రాల వేదికగా అండాల అక్రమ సేకరణ.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు
Hyderabad Police Busts Illegal Egg Racket

Updated on: Nov 02, 2026 | 12:51 PM

పేద మహిళలే లక్ష్యంగా డబ్బు ఆశచూపి వారి నుంచి అక్రమంగా అండాలను సేకరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేయగా.. సుమారు 43 మంది మహిళలను రక్షించారు. అయితే, ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌ శర్మ ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను తీసుకొస్తుండగా.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని ఐవీఎఫ్‌ కేంద్రాలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులతో పాటు బేగంపేట, సరూర్‌నగర్‌ పోలీసులు నగరంలోని ప్రకాశ్‌నగర్‌, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్‌, గోపాలపురం ప్రాంతాల్లోని పలు ఐవీఎఫ్‌ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఒక్కో అండదాన ప్రక్రియకు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తామని ఆశచూపి ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ రాకెట్‌లోని ఏజెంట్లు ఇతర రాష్ట్రాల్లోని యువతులు, మహిళలను గుర్తించి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం వారిని అద్దె గదుల్లో ఉంచి హార్మోన్ల ఇంజెక్షన్లు, మందులు ఇచ్చినట్లు కొందరు మహిళలు పోలీసులకు తెలిపారని సమాచారం.

ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్‌ శర్మ నేతృత్వంలోనే ఈ ముఠా కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా దాదాపు 9 రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మహిళలను ఈ వ్యవహారంలోకి తీసుకొస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

పోలీసులు రక్షించిన మహిళల్లో పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఢిల్లీ, అస్సాం, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us