
ఆహారాన్ని అందించే డెలివరీ బ్యాగుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ముసుగులో దర్జాగా తిరుగుతూ గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరు నిందితులను మహేశ్వరం ఎస్ఓటీ , మంచాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు ప్రదీప్ నుంచి ఈ ఇద్దరు నిందితులు విజయవాడ కేంద్రంగా గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పోలీసుల కళ్లుగప్పేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ బ్యాగులను సాధనంగా ఎంచుకున్నారు. ఆహార పదార్థాల డెలివరీ సిబ్బందిలా వివిధ కాలనీల్లో తిరుగుతూ, తమ నెట్‌వర్క్‌లోని రెగ్యులర్ వినియోగదారులకు గుట్టుగా గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నారు.
ఈ దందా కోసం నిందితులు ప్రత్యేకంగా డిజిటల్ వేయింగ్ మెషిన్‌ను వినియోగిస్తున్నారు. కస్టమర్ అడిగిన పరిమాణాన్ని బట్టి అక్కడికక్కడే తూకం వేసి ప్యాకెట్లు కట్టి చేరవేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ ముసుగులో అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో మంచాల పోలీసులతో కలిసి ఉమ్మడిగా దాడి చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 1.1 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, డిజిటల్ వేయింగ్ మెషిన్, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంచాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రధాన సరఫరాదారు ప్రదీప్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో పాటు ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు కాల్ డేటా ఆధారంగా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.