Hyderabad: నానక్‌రామ్‌గూడలో తీవ్ర విషాదం.. బతుకుదెరువు కోసం వచ్చి.. తిరిగిరాని లోకాలకు

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్ఏఎస్ (SAS) భవనంలో లిఫ్ట్ నిర్వహణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కదలడంతో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: నానక్‌రామ్‌గూడలో తీవ్ర విషాదం.. బతుకుదెరువు కోసం వచ్చి.. తిరిగిరాని లోకాలకు
Hyderabad Lift Accident

Edited By:

Updated on: Nov 20, 2026 | 8:23 PM

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఏఎస్‌ భవనంలో గురువారం లిఫ్ట్‌ నిర్వహణ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ టెక్నీషియన్‌ ప్రాణాలు కోల్పోగా, మరో ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. టీకేఈ ఎలివేషన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో పనిచేస్తున్న రంగొల్ల మనోహర్‌, అల్లూరి వాసు భవనంలోని రెండో అంతస్తులో లిఫ్ట్‌ మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపం లేదా నిర్లక్ష్యం కారణంగా లిఫ్ట్‌ ఒక్కసారిగా పైకి కదలడంతో, అందులో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది మధ్యలో ఇరుక్కుపోయారు.

ఈ ఊహించని ప్రమాదంలో టెక్నీషియన్ రంగొల్ల మనోహర్‌ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. అయితే, మనోహర్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో మరో ఉద్యోగి అల్లూరి వాసు తలకు, కుడిచేతికి బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనపై మృతుడు మనోహర్‌ బంధువు రంగొల్ల వెంకటేశ్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లిఫ్ట్‌ మరమ్మతు పనులు చేపట్టే సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సంబంధిత కంపెనీ యాజమాన్యం, పర్యవేక్షకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us