
ఓవైపు వర్షాభావ పరిస్థితులు… మరోవైపు ఎల్‌నినో ప్రభావం… ఇంకోవైపు సాగునీటి కొరత వెరసి అన్నదాతకు కష్టాలే మిగులుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో వేసిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీళ్లు అందక దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. కానీ… ఆ రైతు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి కూరగాయల సాగును ఎంచుకున్నాడు. ఆరు ఎకరాల్లో చిక్కుడు సాగు చేస్తూ లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నాడు నాగర్ కర్నూల్ జిల్లా రైతు రాజేందర్ రెడ్డి.
వ్యవసాయంలో పంట మార్పిడి… సాగు పద్ధతుల్లో మార్పులు రైతుకు లాభాలను తెచ్చిపెడతాయనడానికి ఈ రైతే నిదర్శనం. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి సుమారు పదేళ్ల క్రితమే కూరగాయల సాగు వైపు అడుగులు వేశారు. గ్రామంలో చాలామంది రైతులు వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేస్తుంటే.. ఈయన మాత్రం కూరగాయల సాగునే నమ్ముకున్నారు. చిక్కుడు, బీరకాయ, సోరకాయ, కాకరకాయ, టమాట వంటి పంటలు సాగు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆరు ఎకరాల్లో చిక్కుడు సాగు చేస్తున్నారు రాజేందర్ రెడ్డి. ఎకరాకు కిలో విత్తనాలు నాటి.. సుమారు 80 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. పంటకు అనువైన పందిళ్లు, తీగల ఏర్పాటు చేసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకు అవసరమైన నీటిని అందిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలోని బావినే ఫామ్ పాండ్‌గా మార్చుకుని నీటిని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. సాగులో ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు.
రాజేందర్ రెడ్డి సాగు చేస్తున్న చిక్కుడు పంట దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంది. ఎకరాకు సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ఎకరాకు రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం మార్కెట్లో చిక్కుడుకాయకు మంచి డిమాండ్ ఉండటంతో పంటకు గిట్టుబాటు లభిస్తోంది. పెట్టుబడి, నీటి వినియోగం, దిగుబడి… ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సాగును లాభసాటిగా మార్చుకుంటున్నారు రాజేందర్ రెడ్డి.
మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం, సాగునీటి కొరతతో ఖరీఫ్‌లో వేసిన వరి, మొక్కజొన్న, పత్తి పంటల దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో కరువు ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశాల నేపథ్యంలో బోర్ల కింద సాగు చేసే రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ నీటితో కూరగాయల సాగు చేస్తూ ఆదాయం పొందుతున్న రాజేందర్ రెడ్డి విధానం ఇతర రైతుల్లోనూ ఆసక్తి రేపుతోంది.
వ్యవసాయం అంటే కేవలం వర్షాలపై ఆధారపడటం మాత్రమే కాదు… అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేయడం కూడా ముఖ్యమే. పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులు మార్చుకుంటే వ్యవసాయంలోనూ లాభాలు సాధించవచ్చని రాజేందర్ రెడ్డి నిరూపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలనుకునే రైతులకు ఈయన సాగు విధానం ఆలోచన కలిగిస్తోంది.