
గంజాయి, ఇతర డ్రగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో విక్రయిస్తున్నారు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకొని యువత మత్తులో జోగుతున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ మత్తు దందా.. పల్లెలకు పాకడం సంచలనంగా మారింది. మత్తుకు బానిసలవుతున్న యువత ఎంతకైనా తెగిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మారుమూల గూడాలు, తండాలు, పల్లెల్లో ఇప్పుడు మత్తు గుప్పు మంటోంది. గంజాయి మీద పోలీసులు ఫోకస్ పెట్టడంతో కొత్త దారులు వెతుకుంటోంది యువత. రెండు రోజుల క్రితం టర్మిన్ మత్తు ఇంజక్షన్ల ముఠా పట్టుబడగా.. తాజాగా ఉట్నూర్ లో మరో మత్తు మందు ముఠా పోలీసులకు చిక్కింది.
నొప్పి నివారణకు వాడే నిషేధిత మాత్రలను మత్తు పదార్ధాలుగా మార్చి సిరంజీలతో ఒంట్లోకి ఎక్కించుకుంటున్న ముఠా గుట్టును ఉట్నూరు పోలీసులు రట్టు చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలను విక్రయిస్తున్న ఓ ఫార్మసిస్ట్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూరు ఈద్గా సమీపంలో గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. మత్తు కోసం కొందరు నిషేధిత నొప్పి నివారణ మాత్రలను పొడి చేసి నీటిలో కలిపి సిరంజీ ద్వారా నరాల్లోకి ఎక్కించుకుంటుండగా.. పోలీసులు వారిని పట్టుకున్నారన్నారు. ఫార్మసిస్ట్ అయిన కదం శేఖర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యువతకు ఈ టాబ్లెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిషేధిత మాత్రలను ఉట్నూరుకు చెందిన చౌహాన్ నిఖిల్జ్, పొడేటి వంశీకృష్ణతో పాటు మరో ఇద్దరు కొనుగోలు చేసి మత్తు కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో నిందితులు చౌహాన్ నిఖిల్ రాజ్, పొడేటి వంశీకృష్ణ, ఫార్మసిస్ట్ కదం శేఖర్ ను రిమాండ్ కు పంపించామని..
మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారని ఏఎస్పి రుత్విక్ సాయి తెలిపారు. నిందితుల నుంచి నిషేధిత టాబ్లెట్లు, సిరంజీలు, యాపిల్, వివో ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
గత రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో కెమికల్ డ్రగ్స్ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించి, ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుల వద్ద నుండి 190 ఇన్సులిన్ సిరంజలు, 50 టర్మిన్ బాటిల్స్, రెండు మొబైల్ ఫోన్స్, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో డ్రగ్స్‌కు బదులు యువత కొత్త దారులు వెతుక్కోవడం.. షెడ్యూల్ హెచ్-1 డ్రగ్స్ అమ్ముతున్న ముఠాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అనస్థీషియా ఇంజెక్షన్లతో ఫార్మా డీలర్ల అక్రమ వ్యాపారం యదేచ్చగా కొనసాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే మరికొన్ని ముఠాల గుట్టు రట్టు కానుట్టు సమాచారం.