
వైరా, అక్టోబర్ 17: దసరా పండగ సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ యువకుడు తల్లిదండ్రుల కళ్లెదుటే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్షణాల్లో జరిగిన ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో శుక్రవారం (అక్టోబర్ 16) చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
గండగలపాడుకు చెందిన కిన్నెర కృష్ణ, విజయ దంపతుల కుమారుడు రాఘవ (19) హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా పండగ సెలవులు రావడంతో రెండ్రోజుల క్రితమే ఇంటికి చేరుకున్నాడు. పండగకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతాడనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. శుక్రవారం ఉదయం బైక్పై దుస్తులు విక్రయించే ఓ వ్యక్తి వారి ఇంటి వద్దకు వచ్చాడు. దీంతో రాఘవ తల్లి విజయ దుస్తులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో నిద్రలేచి బయటకు వచ్చిన రాఘవ.. ‘నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి’ అంటూ తండ్రితో చెప్పి మంచంపై కూర్చున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో తల్లిదండ్రులు, సోదరి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏమైందో అర్థంకాక వెంటనే రాఘవకు సీపీఆర్ చేశారు. అనంతరం ఆటోలో వైరాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాఘవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చేతికి అందివచ్చిన కుమారుడు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న వయసులోనే రాఘవ గుండెపోటుతో మృతిచెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.