
ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న మధ్యాహ్నం అదే ప్రాంతంలో తుఫానుగా బలపడి ఈరోజు (నవంబర్ 2, 2026) తెల్లవారుజామున 02:30 గంటలకు పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మరింత తీవ్రరూపం దాల్చింది. పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఈ తీవ్ర తుఫాను “మురసు” గత 6 గంటల్లో గంటకు 22 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఈరోజు ఉదయం 08:30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 160 కి.మీ, చెన్నైకి ఈశాన్యంగా 180 కి.మీ, కావలికి తూర్పు-ఆగ్నేయంగా 180 కి.మీ, ఒంగోలుకు ఆగ్నేయంగా 210 కి.మీ, మచిలీపట్నంకు దక్షిణంగా 240 కి.మీ దూరంలో ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం నెల్లూరు – నర్సాపూర్ మధ్య ఒంగోలుకు దక్షిణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తీవ్ర తుఫానుగా దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 100 నుండి 110 కి.మీ వేగంతో, గరిష్టంగా 120 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈరోజు, ఎల్లుండి రాస్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇంచుమించు అన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల, భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లోనూ కురిసే అవకాశం ఉంది. ఇక రేపు రాష్ట్రంలోని ఒకటి రెండు దక్షిణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిచే అవకాశం ఉంది. ఈరోజు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 50 నుంచి 60 కి.మీ గరిష్టంగా 70 కి మీ వరకు వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.