Sangareddy: పశువులను మేపడానికి వెళ్లిన కాపలాదారులు.. కనిపించినవి చూసి స్టన్

సంగారెడ్డి జిల్లా మెలిగిరిపేట గ్రామ శివారులో 20కి పైగా మొసలి పిల్లలు, 60కిపైగా గుడ్లు లభించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వాటిని సురక్షితంగా మంజీరా వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. అయితే తల్లి మొసలి ఆచూకీపై గ్రామస్తుల్లో ఇంకా ఆందోళన కొనసాగుతోంది.

Sangareddy: పశువులను మేపడానికి వెళ్లిన కాపలాదారులు.. కనిపించినవి చూసి స్టన్
Crocodile Hatchlings

Edited By:

Updated on: Jun 08, 2026 | 7:27 PM

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో మొసళ్ల కలకలం రేగింది. గ్రామానికి సమీపంలోని ప్రాంతంలో భారీ సంఖ్యలో మొసలి పిల్లలు, గుడ్లు బయటపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. రోజూలాగే పశువులను మేపడానికి వెళ్లిన కాపరులు నేలపై చిన్న చిన్న మొసలి పిల్లలు ప్రాకుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సుమారు 20కి పైగా మొసలి పిల్లలు అక్కడ సంచరిస్తుండటాన్ని గమనించిన వారు వెంటనే గ్రామస్తులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఒక పెద్ద మొసలి గుడ్ల గూడు ఉన్నట్లు గుర్తించారు. అందులో 60కిపైగా మొసలి గుడ్లు ఉన్నట్లు గుర్తించి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మొసలి గుడ్లు పెట్టడం, అవి పిల్లలుగా మారడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మొసలి పిల్లలు, గుడ్లు ప్రమాదంలో పడకుండా అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. వాటిని అత్యంత జాగ్రత్తగా సేకరించి సంగారెడ్డి సమీపంలోని మంజీరా వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. మంజీరా నదీ పరివాహక ప్రాంతం మొసళ్లకు అనుకూల సహజ ఆవాసం కావడంతో వాటిని అక్కడ భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.

అయితే గ్రామ శివారులో ఇంత పెద్ద సంఖ్యలో మొసలి గుడ్లు, పిల్లలు లభించడంతో వాటికి జన్మనిచ్చిన తల్లి మొసలి ఎక్కడ ఉందనే అంశం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు మరింత నిఘా పెంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Follow Us