
పిల్లీ కుక్కల్లా కొట్టుకుంటున్నారు అనే సామెత మన నిత్యజీవితంలో తరచూ వింటూనే ఉంటాం. ఒకే చోట కనిపిస్తే చాలు.. కారాలు మిరియాలు నూరుతూ వెంటపడి మరీ కొట్టుకునే స్వభావం వాటిది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ఇంట్లో మాత్రం ఈ సహజ వైరం చెరిగిపోయింది. జాతి వైరాన్ని పక్కనపెట్టి ఆ పిల్లి, కుక్క పంచ ప్రాణాలుగా కలిసిమెలిసి జీవిస్తూ స్థానికులను అబ్బురపరుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని బండి సుబ్రహ్మణ్య నగర్‌కు చెందిన మౌలాలి ఇంట్లో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తోంది. ఆయన ఇంట్లో పెరుగుతున్న పిల్లి, కుక్క ఎంతో అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. రోజంతా ఒకదానితో మరొకటి కలిసి ఆడుకోవడం, ఒకేచోట పడుకోవడం, పరస్పరం లాలించుకోవడం వంటి దృశ్యాలు చూసేవారిని కట్టిపడేస్తున్నాయి. వీధిలోకి పిల్లి అడుగుపెడితేనే వెంటపడే కుక్కలున్న ఈ రోజుల్లో, ఒకే ఇంట్లో ఈ రెండు జీవులు అన్నాదమ్ముల్లా కలిసి తిరగడం స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ప్రకృతి సిద్ధంగా పాము-ముంగిస, పిల్లి-ఎలుక, పిల్లి-కుక్కల మధ్య వైరుధ్యం సహజం. అయితే చిన్నప్పటి నుంచి ఒకే వాతావరణంలో కలిసి పెరిగినప్పుడు, ప్రేమను పంచినప్పుడు పరస్పరం అలవాటు పడి సహజీవనం సాగిస్తాయని ఈ ఘటన నిరూపిస్తోంది. మౌలాలి ఇంట్లో ఈ మూగజీవాలు ప్రదర్శిస్తున్న ఈ అనుబంధం చూసి చుట్టుపక్కల వారు, జంతు ప్రేమికులు మురిసిపోతున్నారు.
చిన్న చిన్న కారణాలకే స్వార్థం, ద్వేషాలతో మనుషులు ఘర్షణలకు దిగుతున్న నేటి సమాజంలో.. జాతి వైరాలనే మరిచి స్నేహంగా మెలుగుతున్న ఈ పిల్లి, కుక్కల బంధం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. పరస్పర సహనం, స్నేహం, ప్రేమ ఉంటే ఎలాంటి వైరుధ్యాలనైనా జయించవచ్చని ఈ మూగజీవాలు చెప్పకనే చెబుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అపూర్వ స్నేహానికి సంబంధించిన విషయాలు పరిసర ప్రాంతాల్లో వైరల్‌గా మారాయి.