
తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు ఢిల్లీ పెద్దలు వరుస కట్టారు. మూడు రోజులు ముగ్గురు అగ్రనేతలు, మూడు కీలక పర్యటనలు. రేపు నితిన్ నబీన్ కరీంనగర్‌లో అడుగుపెడితే.. 24న అమిత్ షా హైదరాబాద్‌కు వస్తారు. ఇక 25న జేపీ నడ్డా సిద్దిపేటలో పర్యటిస్తారు. ఈ వరుస పర్యటనల వెనుక బీజేపీ భారీ రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్‌లో జరిగే మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్ వెళ్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు రెండు కిలోమీటర్ల వరకు సాగే పాదయాత్రకు నాయకత్వం వహిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి అనే నినాదంతో జరిగే ఈ కార్యక్రమంలో బండి సంజయ్, రామచందర్ రావు, సునీల్ బన్సల్ సహా ముఖ్య నేతలు పాల్గొంటారు. SIR ప్రక్రియపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలకు కరీంనగర్ వేదికగా సమాధానం చెప్పాలని బీజేపీ భావిస్తోంది.
ఇక నవంబర్ 24న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ITC కాకతీయ హోటల్‌కు వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 నుంచి 7.15 గంటల వరకు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రాబోయే కార్యాచరణపై నేతలతో చర్చించనున్నారు. అనంతరం రాత్రి 8.50 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
మరోవైపు నవంబర్ 25న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సిద్దిపేటలో జరిగే మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు.. ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఇలా వరుసగా ముగ్గురు జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు రావడం ద్వారా రాష్ట్ర బీజేపీకి కేంద్ర నాయకత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తోందో స్పష్టమవుతోంది. ఈ పర్యటనలను పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, క్షేత్రస్థాయిలో బీజేపీ బలాన్ని పెంచేందుకు ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.