ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా? వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి!

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయించుకోవడానికి లంచం అడుగుతున్నారా? ఇక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు! తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు టోల్‌ఫ్రీ నంబర్‌ 1064 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్‌ నంబర్‌ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. రోజుకు సగటున 18 నుంచి 20 ఫోన్‌ కాల్స్‌, నెలకు 400కు పైగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అవినీతి అధికారులపై ఏసీబీ నిఘా పెంచింది. లంచం డిమాండ్‌ ఎదురైతే ఎలా ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడుగుతున్నారా? వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి!
Anti Corruption Bureau Telangana

Edited By:

Updated on: Oct 29, 2026 | 7:13 PM

హైదరాబాద్, అక్టోబర్ 29: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల డిమాండ్లకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చర్యలు ముమ్మరం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని చేసి పెట్టేందుకు లంచం డిమాండ్ చేస్తే బాధితులు నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫోన్ చేయవచ్చు. ఇలా రోజుకు సగటున 18 నుంచి 20 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్‌తో పాటు ఈమెయిల్, నేరుగా అందించే ఫిర్యాదులను కలిపి నెలకు 400కు పైగా కంప్లైంట్లు అందుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ప్రజలు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తుండటంతో ఏసీబీ అధికారులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. లంచం డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వ హోదాను అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. అందిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రత్యేకంగా ట్రాప్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారుల కదలికలపై నిఘా పెట్టి, లంచం తీసుకునే సమయంలో పట్టుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు.

లంచం తీసుకునే అధికారులను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నారు. ఫిర్యాదుదారుడి సహకారంతో ఫినాఫ్తలీన్‌ రసాయనం పూసిన నోట్లను ఉపయోగించి ట్రాప్‌ నిర్వహిస్తారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో సంబంధిత అధికారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందితే, దానిని పరిశీలించి కేసులు నమోదు చేసే చర్యలు చేపడుతున్నారు. 2026 జనవరి 1 నుంచి అక్టోబర్ 26 వరకు తెలంగాణ ఏసీబీ మొత్తం 152 కేసులు నమోదు చేసింది. గత ఏడాది 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్టు చేసింది. వీటిలో 157 ట్రాప్‌ కేసులు కాగా, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి 15 కేసులు నమోదయ్యాయి. ఇతర విభాగాలకు చెందిన కేసులు కూడా నమోదయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏసీబీకి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో ఫిర్యాదులపై అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం లేదా ఇతర అనుచిత ప్రయోజనాలు డిమాండ్ చేస్తే ప్రజలు మౌనంగా ఉండకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచిస్తోంది. ఫిర్యాదు చేసిన వారి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తోంది. లంచం డిమాండ్ ఎదురైనప్పుడు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. అలాగే వాట్సాప్‌ నంబర్‌ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అవినీతిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల లంచాల డిమాండ్లను ఏసీబీ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us