వామ్మో.. కార్మికుల బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు! అసలు కథ ఎలా బయటపడిందంటే..

ఆదిలాబాద్‌లో కార్మికుల ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేసి వారి పేర్లతో రూ.8.55 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్ కుమార్ మిట్టల్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఐటీ నోటీసులతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వామ్మో.. కార్మికుల బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు! అసలు కథ ఎలా బయటపడిందంటే..
Adilabad Businessman Arrested

Edited By:

Updated on: Nov 29, 2026 | 8:23 AM

కార్మికుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని వారి పేర్లతోనే కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. అమాయక కార్మికుల ఆధార్, పాన్ కార్డులను సేకరించి వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాలనే తమ వ్యాపార లావాదేవీలకు ఉపయోగించుకుంటూ ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. చివరకు ఐటీ శాఖ నోటీసులతో అసలు బాగోతం బయటపడింది. సుమారు రూ.8.55 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాజ్ కుమార్ మిట్టల్ తన సోదరుడు సంజీవ్ కుమార్ మిట్టల్‌తో కలిసి ఈ వ్యవహారానికి తెరలేపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమ వ్యాపార సంస్థల ఆర్థిక లావాదేవీలు ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా ఉంచాలనే ఉద్దేశంతో తమ వద్ద పనిచేసే కార్మికులైన పెర్క భూమన్న, అలువాల అనిల్ కుమార్ సుధాకర్, మాదస్తువార్ సంతోష్, రమాకాంత్ కేంద్రే, గోదం గజానన్ తదితరుల ఆధార్, పాన్ కార్డులను సేకరించారు. వారి సంతకాలను ఖాళీ కాగితాలపై తీసుకుని శ్రీ రేణుకా మాత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచారు. అనంతరం చెక్‌బుక్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని, ఖాళీ చెక్కులపై సంతకాలు సేకరించి కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ఐటీ నోటీసులతో బట్టబయలు..

సుమారు నాలుగేళ్ల క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు వ్యాపార సంస్థలపై తనిఖీలు నిర్వహించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పన్ను బకాయిలు చెల్లిస్తామని నిందితులు హామీ ఇచ్చినా చెల్లింపులు చేయకుండా కాలయాపన చేసినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు. 2022 జూలై 29న సంబంధిత కార్మికులకు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందడంతో తమ పేర్లపై కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగిన విషయం వారికి తెలిసింది.

ఒక్క ఖాతాలోనే రూ.7 కోట్లకు పైగా..

పెర్క భూమన్న పేరుతో నిర్వహించిన బ్యాంకు ఖాతాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.5.16 కోట్లు, 2014-15లో రూ.1.94 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా ఇతర కార్మికుల ఖాతాలను కలిపి 2012-13 నుంచి 2015-16 వరకు మొత్తం రూ.8.55 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంతో బాధితుల బ్యాంకు ఖాతాలు సైతం ఇబ్బందుల్లో పడ్డాయి. తన సొంత బ్యాంకు ఖాతా ఫ్రీజ్ కావడంతో పాటు అందులో ఉన్న సుమారు రూ.2 కోట్ల నగదును వినియోగించుకోలేకపోయిన పెర్క భూమన్న నిందితులను నిలదీశాడు. సమస్య పరిష్కరిస్తామని నమ్మించి మోసం చేయడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

ఒకరు అరెస్ట్.. మరొకరు పరార్..

బాధితుడి ఫిర్యాదుతో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మిట్టల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సంజీవ్ కుమార్ మిట్టల్ పరారీలో ఉన్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు. నిందితుడి నుంచి ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన పత్రాలు, ఆపిల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. IPCలోని 409, 420, 464, 465, 467, 468 సెక్షన్లతో పాటు బినామీ లావాదేవీల నిషేధ చట్టం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్మికుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారి పేర్లతో కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహించిన ఈ వ్యవహారం ఆదిలాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us