Video: ఒక్క ఫోన్ కాల్‌‌తో యువకుడిని చావు నుంచి కాపాడిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..? వీడియో వైరల్..

ఆత్మహత్య ఆలోచనతో డయల్ 100కు ఫోన్ చేసిన ఆ యువకుడు, తన ఆచూకీ చెప్పకుండానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మృత్యువు అతడిని కౌగిలించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆదిభట్ల పోలీసులు సాంకేతికతను ఆయుధంగా మలుచుకున్నారు. చావు అంచుల్లో ఉన్న వ్యక్తిని కనిపెట్టి ఆస్పత్రిలో చేర్చి.. ఓ కుటుంబం రోడ్డున పడకుండా చేశారు.

Video: ఒక్క ఫోన్ కాల్‌‌తో యువకుడిని చావు నుంచి కాపాడిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..? వీడియో వైరల్..
Adibatla Police Save Youth

Edited By:

Updated on: Apr 08, 2026 | 1:05 PM

నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ప్లీజ్ నన్ను కాపాడండి.. అంటూ డయల్ 100కు వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్ ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. మృత్యువుతో పోరాడుతున్న ఓ యువకుడిని ఆదిభట్ల పోలీసులు టెక్నాలజీ, సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి తప్పించి రియల్ హీరోస్ అనిపించుకున్నారు. మంగళవారం రవిరాజ్ అనే వ్యక్తి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ డయల్ 100కు సమాచారం అందించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తన ఆచూకీ చెప్పడానికి నిరాకరించడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సమయం తక్కువగా ఉండటంతో ఆదిభట్ల సీఐ రవికుమార్, ఎస్సై వెంకటేష్‌లు తక్షణమే రంగంలోకి దిగారు.

జీపీఎస్ టెక్నాలజీతో వేట

బాధితుడు తన లొకేషన్ చెప్పకపోయినా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పోలీసులు అతని లైవ్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని సాయిగూడెం గ్రామంలో రవిరాజ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పెట్రోల్ మొబైల్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ బాలరాజు, డ్రైవర్ ఏఆర్పీసీ రాజేందర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకునేసరికి రవిరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్ కోసం వేచి చూస్తే ప్రాణం పోతుందని భావించిన పోలీసులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడిని తమ పోలీస్ వాహనంలోనే ఎక్కించుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. మార్గమధ్యలో అంబులెన్స్‌కు అప్పగించి.. ఏవీఎస్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో రవిరాజ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ప్రశంసల జల్లు

సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడిన కానిస్టేబుల్ బాలరాజు, రాజేందర్లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రాణాలు కాపాడిన ఖాకీల సాహసానికి స్థానికులు జేజేలు పలుకుతున్నారు. ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు కేవలం రక్షక భటులే కాదు.. ప్రాణదాతలు కూడా అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Follow Us