900 ఏళ్ల క్రితం సూర్యగ్రహణం వేళ ఏం జరిగిందో తెలుసా..? కొత్తకోటలో వెలుగులోకి అరుదైన శాసనం..

తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో సుమారు 900 ఏళ్ల నాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. కళ్యాణి చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుడి కాలానికి చెందిన ఈ శాసనం 1118 మే 22న సూర్యగ్రహణం సందర్భంగా జరిగిన భూదానాలను వెల్లడిస్తోంది. అప్పటి దేవాలయాలు, దాతలు, భూముల విస్తీర్ణం, సామాజిక సంప్రదాయాలకు సంబంధించిన ఆసక్తికర చారిత్రక వివరాలను బయటపెడుతోంది.

900 ఏళ్ల క్రితం సూర్యగ్రహణం వేళ ఏం జరిగిందో తెలుసా..? కొత్తకోటలో వెలుగులోకి అరుదైన శాసనం..
Kothakota Inscription

Edited By:

Updated on: Nov 13, 2026 | 4:49 PM

వనపర్తి జిల్లా కొత్తకోటలో దాదాపు తొమ్మిది శతాబ్దాల నాటి చరిత్ర వెలుగులోకి వచ్చింది. పురాతన శివాలయంలో ఉన్న ఓ శాసనం చరిత్రకారుల దృష్టిని ఆకర్షించింది. కళ్యాణి చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుడి పాలనాకాలానికి చెందిన ఈ శాసనం… అప్పటి భూదానాలు, దేవాలయాలు, సామాజిక వ్యవహారాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. ముఖ్యంగా సూర్యగ్రహణం సందర్భంగా భూములను దానం చేసినట్లు ఇందులో పేర్కొనడం విశేషం.. కొత్తకోట పురాతన శివాలయ ప్రాంగణంలో ఉన్న శాసనస్తంభాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు గుర్తించారు. శాసనస్తంభం మధ్యలో ఐమూలగా విరిగివుంది. దానిమీద కనిపిస్తున్న లిపి 12వ శతాబ్దపు తెలుగన్నడం.. భాష కన్నడం. ఒకచోట త్రిభువనమల్ల దేవ అని కనిపిస్తున్నది. కనుక ఈ శాసనం కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవ 6వ విక్రమాదిత్యుని కాలంనాటిదని తెలుస్తున్నది. ఇక బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ బైరోజు శ్యాంసుందర్, హనుమన్నగారి వేమారెడ్డి, పండ్రప్రగడ రామారావు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాసన వివరాలను నమోదు చేశారు. బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్ శాసనాన్ని చదివి, అందులోని చారిత్రక అంశాలను విశ్లేషించారు.

శాసనంలోని వివరాల ప్రకారం..

శాసనస్తంభం మొదటివైపున, శాసనం కేశవుని స్మరిస్తూ, పుండరీకాక్షునికి నమస్కరిస్తూ, పాహిమాం అంటూ మొదలవుతున్నది. సత్యాశ్రయకులతిలకుడు, చాళుక్యాభరణుడు త్రిభువనమల్లదేవర 6వ విక్రమాదిత్యుని పాలనాకాలంలో, 43 చాళుక్యవిక్రమ సం. విలంబినామ సం. సోమవారం సూర్యగ్రహణపర్వ నిమిత్తం కాలబోలవిరనోలబ మల్లాదేసరడ్డి కేశవదేవాలయంలో ఉండే కాదిరాజన్న కాళ్ళు కడిగి, సింగనగదనకొలలులో 3మర్తురుల నీర్నేల (తరి)భూమిని, పల్లయనాయక కాదిరాజన కాళ్ళుకడిగి 11మర్తురుల భూమిని దానం చేసారు. పేర్కొన్న సంవత్సరం, సూర్యగ్రహణాన్ని బట్టి ఈ శాసనం 1118 మే 22 అని నిర్ధారించవచ్చు. రెండవవైపున శాసనభాగం లిపి చెరిగిపోయివుంది. ‘రామేశ్వర పండితుని’ పేరొక్కటి, సూర్యగ్రహణ ప్రస్తావన తెలుస్తున్నది. మూడవ వైపున కూడా ఎవరికాళ్ళో కడిగి శ్రీనాయకుడు దానం చేసినట్లు అర్థమవుతున్నది.

మొత్తానికి.. నేటి కొత్తకోటలోని ఓ పురాతన శివాలయం దాదాపు 900 ఏళ్ల క్రితం నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. సూర్యగ్రహణం రోజున జరిగిన భూదానాల నుంచి అప్పటి పాలకుల వివరాల వరకు ఎన్నో విశేషాలను ఈ శాసనం బయటపెడుతోంది. కాలగర్భంలో మరుగునపడిన ఇలాంటి చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి వస్తుండటంతో పాలమూరు ప్రాంత గత చరిత్రపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us