జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్‌!

బోనాల పండక్కి హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక హేమశ్రీ జలుబు, దగ్గుతో స్వల్ప అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత ఆమె స్పృహతప్పి మృతి చెందింది. ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌ వల్లే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

జలుబు చేసిందని RMP డాక్టర్‌ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్‌!
Girl Dies After Injection At Rmp Clinic

Updated on: Aug 11, 2026 | 6:15 AM

ఖమ్మం, ఆగస్ట్‌ 11: బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. అయితే చిన్నపాటి జలుబు, దగ్గుతో అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లిన ఆమె.. ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై సూరజ్‌, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..

బస్వాపురానికి చెందిన చల్లా రమేశ్‌, మౌనిక దంపతుల కుమార్తె హేమశ్రీ (14) స్థానిక కస్తూర్బా విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన హేమశ్రీ జాతరలో కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపింది. ఆదివారం ఆమెకు జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించాయి. తిరిగి పాఠశాలకు పంపించాల్సి ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆర్‌ఎంపీ ఓ ఇంజక్షన్‌ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో ఇంజక్షన్‌ ఇస్తుండగా హేమశ్రీ ఒక్కసారిగా స్పృహతప్పి నోటి నుంచి నురగ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బాలిక ఊపిరాడక కొట్టుమిట్టాడుతుండటంతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే హేమశ్రీ మృతి చెందినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

‘సాధారణ జలుబు, దగ్గు అని వెళ్తే బిడ్డ ప్రాణాలు పోయాయి’

తమ కుమార్తెకు సాధారణ జలుబు, దగ్గు మాత్రమే ఉన్నాయని, చికిత్స కోసం తీసుకెళ్తే ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలిక మృతితో బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆదివారం రాత్రి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాలికను ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత సుమారు గంటపాటు ఎలాంటి వైద్యం అందించారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందినట్లు సిబ్బంది తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర వివరాలను పోలీసులు పరిశీలించారు. ఆర్‌ఎంపీ గుర్తుతెలియని ఇంజక్షన్‌ ఇవ్వడం వల్లే తన కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ హేమశ్రీ తండ్రి రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూరజ్‌ తెలిపారు. బాలిక మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. హేమశ్రీని తల్లిదండ్రులతో కలిసి ఖమ్మం ఆసుపత్రికి తీసుకొచ్చిన గ్రామీణ వైద్యుడు.. బాలిక మృతి చెందినట్లు తెలిసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు ఎస్సై పేర్కొన్నారు. బాలిక మృతికి అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు, వైద్య పరీక్షల అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఇంజక్షన్‌ కారణంగానే మృతి చెందిందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us