
స్పోర్ట్స్ బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా R2 మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం R2కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. R15 కంటే మెరుగైన పనితీరు, శక్తివంతమైన ఇంజన్‌తో ఇది రానుంది. కేటీఎం, హీరో బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కొత్త బైక్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం.
యమహా R2ను R15కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లేదు. R15 లైనప్‌లోనే కొత్త మార్పులు చేసి, R2కు ప్రత్యేక స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న R15 M వేరియంట్ భవిష్యత్తులో నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే థర్డ్ జెనరేషన్ R15 ఆధారంగా ఉన్న R15 S కూడా లైనప్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం యమహా R15 ధర సుమారు రూ. 1.57 లక్షల నుంచి రూ. 1.98 లక్షల వరకు ఉంది.
ఈ నేపథ్యంలో R2 ధర రూ. 2 లక్షల నుంచి రూ. 2.20 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అయితే అధికారిక ధరను ఆగస్టు 27న లాంచ్ సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బైక్‌లో 200 నుంచి 220cc మధ్య సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేటీఎం ఆర్సీ 200, హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. R15లో ఉన్న అధిక రివింగ్ ఇంజన్ స్వభావాన్ని R2లో కూడా కొనసాగించే అవకాశం ఉంది.
యమహా R2ను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో విక్రయించడంతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేసే అవకాశం ఉంది. ప్రీ బుకింగ్ కోసం చెల్లించే రూ. 10,000 పూర్తిగా రీఫండ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే రీఫండ్ ప్రక్రియ సెప్టెంబర్ 5 తర్వాత ప్రారంభమవుతుందని సమాచారం.
ముందుగానే బుక్ చేసుకున్న కస్టమర్లకు బైక్ డెలివరీ విషయంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు యమహా స్పష్టం చేసింది. R15 కంటే ఎక్కువ పనితీరు కోరుకునే, ఖరీదైన స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలనుకునే వారికి యమహా R2 ఒక ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. ఆగస్టు 27 కోసం బైక్ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టెక్నాలజీ పరంగానూ, డిజైన్ పరంగానూ ఇది యువతను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం.