
మగాడు ఏడవకూడదు, ఆడవాళ్లు చిన్న విషయానికే కన్నీళ్లు పెట్టుకుంటారు.సమాజంలో తరచూ వినిపించే మాటలివి. అయితే, మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ, జీవశాస్త్ర, మానసిక కారణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. జర్మన్ సొసైటీ ఆఫ్ ఆప్తాల్మాలజీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక మహిళ ఏడాదికి సగటున 30 నుండి 64 సార్లు ఏడిస్తే, పురుషులు కేవలం 6 నుండి 17 సార్లు మాత్రమే ఏడుస్తారట. అలాగే, మహిళలు ఏడిస్తే ఆ కన్నీళ్లు సగటున 6 నిమిషాల పాటు సాగితే, పురుషులలో అది రెండు మూడు నిమిషాల్లోనే ముగిసిపోతుంది. మరి ఈ వ్యత్యాసానికి అసలు కారణం భావోద్వేగాలా? లేక హార్మోన్లా? అంటే.. రెండూ కూడా కీలక పాత్ర పోషిస్తాయట.
మహిళల శరీరంలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కేవలం పాలిచ్చే తల్లులలోనే కాదు, సాధారణ మహిళల్లో కూడా పురుషుల కంటే 60% ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్‌కు భావోద్వేగాలకు, కన్నీళ్లు రావడానికి ప్రత్యక్ష సంబంధం ఉంది.పురుషులలో ఎక్కువగా ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ కన్నీళ్లను అణచివేయడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది పురుషులు అంత సులభంగా ఏడవకుండా నిరోధిస్తుంది.శారీరక నిర్మాణ శాస్త్రం ప్రకారం, మహిళల్లో కన్నీటి గ్రంధులు పురుషుల కంటే చిన్నవిగా, లోతు తక్కువగా ఉంటాయి. దీనివల్ల వారిలో కన్నీళ్లు త్వరగా నిండి, బయటకు వచ్చేస్తాయి. పురుషులలో కన్నీటి గ్రంధులు పెద్దవిగా ఉండటం వల్ల అవి ఎక్కువ కన్నీళ్లను లోపలే నిలిపి ఉంచగలవు.
మహిళలు భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానం పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మహిళల మెదడులోని ఎమిగ్డలా ఇతర భాగాలు ఒత్తిడికి, బాధకు చాలా త్వరగా స్పందిస్తాయి. ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు వారు దాన్ని లోతుగా అనుభూతి చెందుతారు.ఏడవడం అనేది శరీరం తనను తాను శాంతపరచుకోవడానికి చేసే ఒక ప్రక్రియ. ఏడ్చినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు ఆక్సిటోసిన్ వంటి ఫీల్-గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. మహిళలు ఏడవడం ద్వారా తమ ఒత్తిడిని, ఆందోళనను సులభంగా బయటకు పంపేస్తారు.
మన సమాజం పెంచే విధానం కూడా దీనిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నప్పటి నుండి బాలికలు ఏడిస్తే సహజంగానే తీసుకుంటారు. నువ్వు అమ్మాయివి, ఏడిస్తే పర్లేదు అనే వాతావరణం ఉంటుంది. దీనివల్ల వారు తమ బాధను కన్నీళ్ల రూపంలో దాచుకోకుండా వ్యక్తపరుస్తారు.అదే ఒక అబ్బాయి ఏడిస్తే మగవాడివై ఉండి ఏడుస్తావేంటి? ఆడదానిలా ఏడవకుఅని చిన్నప్పుడే నొక్కిచెబుతారు. దీనివల్ల పురుషులు తమ బాధను లోపలే అణచివేయడం అలవాటు చేసుకుంటారు. అది కన్నీళ్లుగా కాకుండా కోపంగానో, చిరాకుగానో బయటకు వస్తుంది.
మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఏడవడానికి హార్మోన్లు పునాది వేస్తే.. సామాజిక పరిస్థితులు, భావోద్వేగాలు దాన్ని మరింత ప్రేరేపిస్తాయి. అయితే, ఏడవడం అనేది బలహీనత కాదు. సైన్స్ ప్రకారం ఏడవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మానసిక ఒత్తిడి తగ్గి ఆయుష్షు పెరుగుతుంది. బహుశా అందుకే, పురుషుల కంటే మహిళల సగటు జీవితకాలం ఎక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు చెప్తారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.