
TVS M1-Sను రోజువారీ ప్రయాణాలతో పాటు వేగవంతమైన రైడింగ్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం రూపొందించారు. ఇందులో 4.2kWh లిథియం అయాన్ NMC బ్యాటరీని అందించారు. యూరోపియన్ WMTC టెస్టింగ్ ప్రమాణాల ప్రకారం ఈ స్కూటర్ 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే భారత్‌లో ఈ స్కూటర్ ఎప్పుడు విడుదలవుతుంది? ధర ఎంత ఉంటుంది? అనే వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు.
TVS M1-Sలో 4.2kWh బ్యాటరీని ఫ్లోర్‌బోర్డ్ భాగంలో అమర్చారు. దీనివల్ల స్కూటర్ గురుత్వ కేంద్రం తక్కువగా ఉండి, బరువు సమతుల్యత మెరుగుపడుతుంది. ఇందులో చాసిస్‌కు అనుసంధానించిన Permanent Magnet Synchronous మోటార్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 12.5kW పవర్ లేదా సుమారు 17PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 105 కిలోమీటర్లు. అయితే వాస్తవ వినియోగంలో రేంజ్ అనేది రోడ్డు పరిస్థితులు, వేగం, రైడింగ్ విధానంపై ఆధారపడి మారుతుంది.
ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో 1.8kW సామర్థ్యం కలిగిన ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉంది. కంపెనీ సమాచారం ప్రకారం, బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు గంటా 15 నిమిషాలు పడుతుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక రెండు షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండు వైపులా 14 ఇంచుల వీల్స్ అందించారు. ముందు 110/70, వెనుక 120/70 టైర్లు ఉన్నాయి. రెండు చక్రాలకు 230mm డిస్క్ బ్రేకులతో పాటు డ్యూయల్ ఛానల్ ABS సదుపాయం కల్పించారు.
డిజైన్ విషయానికి వస్తే TVS M1-S మ్యాక్సీ స్కూటర్ తరహాలో కనిపిస్తుంది. పెద్ద ఫ్రంట్ అప్రాన్, విండ్‌షీల్డ్, ఆకర్షణీయమైన లైటింగ్, లేయర్డ్ బాడీ ప్యానెల్స్ ఉన్నాయి. తెలుపు, నలుపు రంగుల డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌తో పాటు ఆరెంజ్ వీల్స్ స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. సింగిల్ పీస్ స్టెప్‌డ్ సీటు, ర్యాక్, టాప్ బాక్స్ కూడా ప్రదర్శించిన మోడల్‌లో కనిపిస్తున్నాయి. అయితే ర్యాక్, టాప్ బాక్స్ ఆప్షనల్ యాక్సెసరీలుగా లభించే అవకాశం ఉంది.
ఈ స్కూటర్‌లో సీటు కింద 26 లీటర్ల స్టోరేజ్ స్పేస్, ముందు గ్లోవ్‌బాక్స్, అదనపు ఓపెన్ స్టోరేజ్ ఉన్నాయి. సీటు ఎత్తు 800mm, గ్రౌండ్ క్లియరెన్స్ 170mm, కెర్బ్ వెయిట్ 150 కిలోలుగా ఉంది. క్రూయిజ్ కంట్రోల్, TPMS, USB Type-A ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 7 ఇంచుల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు Bluetooth, Wi-Fi, LTE కనెక్టివిటీ సపోర్ట్ లభిస్తుంది. Android, iOS ఫోన్లను కనెక్ట్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా సీట్ అన్‌లాకింగ్, కీ-ఫాబ్ ఇగ్నిషన్, Find My Bike, OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి సదుపాయాలు పొందవచ్చు. ప్రస్తుతం TVS అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణపై దృష్టి పెట్టింది. భారత్‌లో M1-S విడుదల తేదీ, ధర, అందుబాటు వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.