
ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే కొత్త ఇన్నోవా హైక్రాస్‌లో డిజైన్‌తో పాటు టెక్నాలజీ పరంగా కూడా అప్‌డేట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మెరుగైన డిజిటల్ డిస్‌ప్లే, కొత్త క్యాబిన్ థీమ్ వంటి మార్పులు ఆకర్షించనున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందనే సమాచారం ఈ ఫేస్‌లిఫ్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.
కొత్త ఇన్నోవా హైక్రాస్ ముందు భాగంలో ప్రధాన మార్పులు కనిపించనున్నాయి. గత మోడల్‌తో పోలిస్తే పెద్ద సూపర్ గ్రిల్, సన్నని LED హెడ్‌ల్యాంప్స్, కొత్త DRLలు వచ్చే అవకాశం ఉంది. మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా రూపొందించిన టయోటా టైసర్ డిజైన్‌ను పోలిన DRLలను ఇందులో అందించవచ్చని సమాచారం. రీడిజైన్ చేసిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ LED టెయిల్ ల్యాంప్స్‌తో పాటు కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉండవచ్చు.
ఇంటీరియర్‌లో ప్రస్తుతం ఉన్న 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ స్థానంలో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను అందించే అవకాశం ఉంది. దీనికి జతగా 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రావచ్చని తెలుస్తోంది. కొత్త క్యాబిన్ థీమ్, సీట్ అప్‌హోల్స్టరీ, ట్రిమ్స్‌తో పాటు 360 డిగ్రీల కెమెరా, ADAS టెక్నాలజీలోనూ అప్‌గ్రేడ్స్ ఉండవచ్చు. JBL సౌండ్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు కొనసాగనున్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఆప్షన్లు కొనసాగవచ్చు. పెట్రోల్ ఇంజిన్ 171 PS పవర్, 204 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ వెర్షన్ 189 PS పవర్, 191 Nm టార్క్ అందిస్తుంది. వీటితో పాటు కొత్తగా ఫ్లెక్స్ ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్ ధరలు రూ.18.70 లక్షల నుంచి రూ.31.84 లక్షల వరకు ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చే మార్పులను బట్టి ధరలు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. అధికారిక ధరలు నవంబర్ 25న వెల్లడయ్యే అవకాశం ఉంది.