
Recharge Prices: మొబైల్ వినియోగదారులకు షాకిచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. కొత్త ఏడాదిలో ఫోన్ మెయింటెన్స్ మరింత పెరగనుంది. కొత్త ఏడాదిలో టెలికాం కంపెనీలు మొబైల్ వాడేవారికి షాకిచ్చేందుకు సిద్దమవుతున్నాయి. కొత్త ఏడాదిలో రీఛార్జ్ ధరల పెంపునకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. ప్రముఖ సంస్థలైన ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఒకేసారి ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 10 శాతం 12 శాతం వరకు ధరలను పెంచనున్నాయని సమాచారం. జనవరిలో టెలికాం కంపెనీల నుంచి ఈ ప్రకటన వచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మొబైల్ రీఛార్జ్ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరింత భారం కానున్నాయి.
రీఛార్జ్ ధరలు త్వరలో పెరగనున్నాయని, ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటే పాత ప్లాన్లు వర్తిస్తాయని ఫైనాన్స్ పేమెంట్ యాప్‌ల నుంచి వినియోగదారులకు అలర్ట్ మెస్సేజులు వస్తున్నాయి. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మొబైల్ వాడేవారు ఆందోళన చెందుతున్నారు. పేమెంట్ యాప్‌ల నుంచి అలర్ట్ మెస్సేజ్‌లు వస్తుండటంతో నిజంగానే ధరలు పెరుగుతాయా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు రీఛార్జ్ ధరలను వీలైనంత త్వరలో పెంచాలని టెలికాం కంపెనీలు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పేమెంట్ యాప్‌ల నుంచి అలర్ట్‌లు రావడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఒకవేళ ధరలు పెంచితే ఇప్పుడున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు మరింత పెరగనున్నాయి. రూ.199 రీఛార్జ్ ప్లాన్ ధర రూ.222కు పెరిగే అవకాశముంది. ఇక రూ.899 ప్లాన్ ధర రూ.1006 కావొచ్చు. 5జీ నెట్‌వర్క్‌ను అన్ని ప్రాంతాలకు విస్తరించడం, పెరుగుతున్న ఖర్చులను కవర్ చేసుకోవడానికి టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. అతి త్వరలోనే కంపెనీల నుంచి ఈ ప్రకటన రావొచ్చని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలను భారీగా పెంచే అవకాశముంది. ఇక ఎయిర్‌టెల్ ఇప్పటికే రూ.121, రూ.181 వంటి చవకైన ప్లాన్లను ఎత్తివేసింది. ఇక జియో కూడా రీఛార్జ్ ధరలను భారీగా పెంచనుంది.