Maps: గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకండి.. సెర్చ్‌ చేసేప్పుడు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి

|

Jul 04, 2024 | 5:52 PM

అయితే అన్ని సందర్భాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మొచ్చా అంటే.. ఇటీవల జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే కచ్చితంగా అవునని సమాధానం మాత్రం చెప్పలేని పరిస్థితి. గూగుల్‌ మ్యాప్స్‌లో చూసుకుంటూ వెళ్తూ ప్రమాదాలకు గురైన సంఘటనలు ఇటీవల చాలా చూశాం. తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన మ్యాప్స్‌ను ఉపయోగించాలంటేనే...

Maps: గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకండి.. సెర్చ్‌ చేసేప్పుడు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి
Google Maps
Follow us on

ఒకప్పుడు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అడ్రస్‌ తెలుసుకోవడానికి పక్కన ఉన్న వారిని అడుగుతూ వెళ్లే వాళ్లం. కానీ ప్రస్తుతం ఏ అడ్రస్‌ కావాలన్నా వెంటనే గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి వెతికేస్తున్నాం. మ్యాప్స్‌లో చూపించిన ఆధారంగా గమ్య స్థానానికి చేరుకుంటున్నాం. దీంతో గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగం భారీగా పెరిగింది.

అయితే అన్ని సందర్భాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మొచ్చా అంటే.. ఇటీవల జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే కచ్చితంగా అవునని సమాధానం మాత్రం చెప్పలేని పరిస్థితి. గూగుల్‌ మ్యాప్స్‌లో చూసుకుంటూ వెళ్తూ ప్రమాదాలకు గురైన సంఘటనలు ఇటీవల చాలా చూశాం. తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన మ్యాప్స్‌ను ఉపయోగించాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిని వెతుకుతూ వెళ్లగా నదిలోకి వెళ్లారు.

దీంతో నదిలో చిక్కుకుపోయిన వారిని అధికారులు కష్టపడి రక్షించారు. కేరళలోని కురుప్పంతరాలో నలుగురు పర్యాటకులు కారులో వెళ్తుండగా, మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి నదిలో చిక్కుకు పోయారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు పర్యాటకులను ప్రాణాలతో రక్షించారు. ఇలా గూగుల్‌ మ్యాప్స్‌ కారణంగా ప్రమాదాల్లో ఇరుక్కున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మొద్దనే చర్చ తెర పైకి వస్తోంది. ఇదే సమయంలో తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు.

మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తుంటే ముందుగా అక్కడ సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌తో పాటు ఆసుపత్రి నెంబర్‌ను దగ్గర ఉంచుకోవాలి. అలాగే ప్రతీ సందర్భంలో మ్యాప్స్‌పైనే ఆధారపకుండా స్థానికులను పలకరిస్తూ, అడ్రస్‌ను తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలి. మ్యాప్స్‌లో చూపిస్తున్న సమాచారాన్ని క్రాస్‌ చెక్‌ చేస్తూ ముందుకు వెళ్లాలి. అలాగే మ్యాప్స్‌లో జర్నీ స్టార్ట్‌ చేయగానే ముందుగా రూట్‌ను పూర్తిగా గమనించండి. రోడ్డు ఒకవేళ దట్టమైన చెట్లు లేదా తారు రోడ్డు కాకుండా మట్టి రోడ్డుపైకి చూపిస్తుంటే జాగ్రత్త పడాలి. అలాగే మ్యాప్స్‌ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోండి. కొత్తగా ఏవైనా మార్పులు జరిగితే తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా గూగుల్‌ కంటే స్థానికంగా ఉన్న ప్రజలకే స్పష్టమైన రూట్ తెలుస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..