
OPPO తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన Oppo Find X10 పై భారీ అప్‌గ్రేడ్‌లతో పనిచేస్తున్నట్లు తాజా లీకులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో 8,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను అందించే అవకాశం ఉందన్న సమాచారం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Find X9 సిరీస్‌లో గరిష్టంగా 7,500mAh బ్యాటరీ మాత్రమే అందుబాటులో ఉండగా, కొత్త తరం Find X10 ఫోన్లు బ్యాటరీ సామర్థ్యంలో మరో పెద్ద ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం, Find X9, Find X9s, Find X9s Pro మోడళ్లలో 7,025mAh బ్యాటరీలు ఉండగా, Find X9 Ultraలో 7,050mAh, Find X9 Proలో 7,500mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు Find X10 సిరీస్ ఈ రికార్డులను అధిగమించనున్నట్లు సమాచారం.
డిస్‌ప్లే విషయంలో కూడా ఒప్పో పెద్ద మార్పులు చేయనుందని తెలుస్తోంది. స్టాండర్డ్ Find X10 మోడల్‌లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్‌ను మరీ మందంగా లేదా బరువుగా కాకుండా డిజైన్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా భావిస్తున్న Find X10 Pro Max కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్‌లతో రావచ్చని అంచనా. ఇందులో డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉందని సమాచారం. 200MP మెయిన్ కెమెరాతో పాటు, 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ కూడా అందించే అవకాశముంది.
అదనంగా 6.89 అంగుళాల 2K LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్‌లో కొత్త MediaTek డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్ ఉపయోగించే అవకాశం ఉంది. AI ఫీచర్లు, గేమింగ్ పనితీరు, బ్యాటరీ ఎఫిషియెన్సీ మరింత మెరుగుపడేలా కంపెనీ దృష్టి సారించినట్లు సమాచారం. అయితే కంపెనీ ఇప్పటివరకు Find X10 సిరీస్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఏడాది చివర్లో చైనాలో లాంచ్ చేసి, ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి