Moon Tourism: ఇక చందమామపైకి వెళ్లి కాఫీ తాగి రావచ్చు.. మూన్ టూరిజం గేట్లు తెరిచిన కంపెనీలు!

|

Sep 24, 2021 | 3:59 PM

అందాల జాబిల్లిని చూడాలన్న బాల రాముడి కోర్కెను తల్లి అద్దంలో చూపించి తీర్చిందని పురాణ గాధ. ఇప్పుడు డబ్బుంటే చాలు చందమామను దగ్గరగా చూడటం ఏమి ఖర్మ.. వెళ్లి అక్కడే బుడ్డోడికి బువ్వ తినిపించి తీసుకురావచ్చు.

Moon Tourism: ఇక చందమామపైకి వెళ్లి కాఫీ తాగి రావచ్చు.. మూన్ టూరిజం గేట్లు తెరిచిన కంపెనీలు!
Moon Tourism
Follow us on

Moon Tourism: చందమామ రావే.. జాబిల్లి రావే.. అని అమ్మ బువ్వ తినిపిస్తూ పాడే రోజులు పోయాయి. అందాల జాబిల్లిని చూడాలన్న బాల రాముడి కోర్కెను తల్లి అద్దంలో చూపించి తీర్చిందని పురాణ గాధ. ఇప్పుడు ఆధునిక కాలం కదా.. డబ్బుంటే చాలు చందమామను దగ్గరగా చూడటం ఏమి ఖర్మ.. వెళ్లి అక్కడే బుడ్డోడికి బువ్వ తినిపించి తీసుకురావచ్చు. ఏమిటీ హెచ్చులు అనుకుంటున్నారా? కాదు ఇది నిజం కాబోతోంది. చందమామను దూరం నుంచి చూసి పదాలు పేర్చిన కవులు ఇప్పుడు చందమామ మీద కూచుని ఆ అందాలను వర్ణించే అవకాశం వచ్చేసింది. ఎటొచ్చీ అంత ఖర్చుచేసే శక్తి ఉండాలంతే. ఇన్నాళ్ళు చందమామ పైకి ఆస్ట్రోనాట్స్ (వ్యోమగాములు) వెళ్ళడం మనకు తెలుసు. అంతెందుకు.. అంతరిక్షంలోకి వెళ్ళడమే సాధారణ వ్యక్తులకు సాధ్యమయ్యే పని కాదు. దానికోసం ఎన్నో ఆంక్షలు.. ఇబ్బందులు ఉండేవి ఇప్పటివరకూ. కానీ, ఇటీవల అంతరిక్షంలోకి సాధారణ వ్యక్తులు వెళ్లి వచ్చేశారు. స్పేస్ టూరిజం పేరుతో వేలాది కోట్ల రూపాయల వ్యాపారం మొదలైపోయింది. ఈ వ్యాపారానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ మూన్ టూరిజం వేళ్ళూనుకుంటోంది. మరి ఇది ఎలా సాధ్యమో.. ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం..

మూన్ టూరిజం.. స్పేస్ టూరిజం తర్వాత రియాలిటీగా మారబోతోంది. అంతరిక్షానికి మార్గం తెరిచిన తరువాత, ప్రపంచంలోని ఇద్దరు ధనిక పారిశ్రామికవేత్తలు జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్ రాబోయే 3-4 సంవత్సరాలలో ప్రజలను చంద్రునిపైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రెండు దిగ్గజాల కంపెనీలు చంద్రునిపై ల్యాండింగ్ చేయడానికి ల్యాండర్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. స్పేస్‌ఎక్స్‌లో ఇప్పటికే 8 మంది కస్టమర్‌లు ఉన్నారు, వారు చంద్రుడికి వెళ్లడానికి తమ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

నాసా మస్క్ స్పేస్‌ఎక్స్.. బెజోస్ బ్లూ ఆరిజిన్‌లకు కాంట్రాక్ట్‌లను ఇచ్చింది. చంద్రుడిపై సాఫీగా ప్రయాణించడానికి నాసా నుండి రూ. 1078 కోట్ల ఒప్పందాన్ని అందుకున్న 5 కంపెనీల సమూహంలో భాగం. నాసా ఈ ఆర్టెమిస్ మిషన్ ప్రోగ్రామ్ లక్ష్యం చంద్రుడిపైకి మొదటి మహిళ, నల్లజాతి వ్యక్తిని పంపడం. లిసా వాట్సన్ మోర్గాన్, నాసా హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ మేనేజర్, స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్‌తో ఒప్పందం తరతరాలుగా చంద్రుని కొత్త ప్రాంతాలను తెరవడం కోసం బలమైన కొత్త ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉందని చెప్పారు.

చంద్రునిపై నిర్మించే గృహాలు, రోవర్ కంపెనీలు కూడా చంద్రునిపై కొత్త విద్యుత్ వ్యవస్థలను పరీక్షిస్తాయి. అంతరిక్ష పరిశ్రమతో కలిసి మళ్లీ చంద్రునిపైకి మనుషులను పంపడానికి సిద్ధమవుతున్నామని నాసా మానవ అన్వేషణ కార్యకలాపాల అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కాథీ లీడర్స్ మీడియాతో చెప్పారు. ఒక క్యాప్సూల్ నుండి నలుగురిని పంపడానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఈ పథకానికి సంబంధించిన అధికారులు అంచనా వేశారు.

అదే సమయంలో, ఇటీవల అంతరిక్ష కేంద్రానికి వెళ్లే సిబ్బంది కోసం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. చంద్రుడి పర్యటన అంతరిక్షం కంటే ఖరీదైనది. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టికెట్‌ను రూ .3.5 కోట్లకు ఉంచింది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి నాసా పర్యవేక్షణలో స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్‌ను రూపొందిస్తోంది. దాని నమూనా లోని అనేక విమానాలు విజయవంతమయ్యాయి.

స్టార్‌షిప్‌లో మూన్‌వాక్ కోసం క్యాబిన్ ఉంటుంది.
నాసా ఓరియన్ రాకెట్ కూడా తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇది నలుగురు వ్యోమగాములను చంద్రుని కక్ష్యకు పంపుతుంది. అక్కడ నుండి, ల్యాండింగ్ సిస్టమ్ సహాయంతో ఇద్దరు ప్రయాణీకులు చంద్రునిపైకి దిగుతారు. వారం తర్వాత తిరిగి వస్తారు. దీని కోసం సంస్థ రూ. 21 వేల కోట్లు పొందుతుంది. స్పేస్‌ఎక్స్ బృందం మానవ శక్తితో నడిచే అంతరిక్ష ప్రయాణానికి నాసా అవసరాలు, ప్రమాణాల ప్రకారం ల్యాండర్‌ను నిర్మిస్తోంది.

చంద్రుడిపై ల్యాండ్ అయ్యేలా రూపొందించిన ల్యాండర్, రాప్టర్ ఇంజిన్, ఫాల్కన్, డ్రాగన్ వాహనాలను వారసత్వంగా పొందుతుంది. మూన్‌వాక్ ప్రయాణీకుల కోసం స్టార్‌షిప్‌లో విశాలమైన క్యాబిన్ కూడా ఉంటుంది. మళ్లీ చంద్రుడిపైకి వెళ్లడానికి కూడా ఈ రాకెట్ ఉపయోగపడుతుంది.

అదండీ విషయం.. ఇక రాబోయే కాలంలో మనం చంద్రుని మీదకు వెళ్ళాలని అనుకుంటున్నారా? జస్ట్ 500 కోట్లు చెల్లించండి.. ఇన్స్యూరెన్స్ ఫ్రీ.. అక్కడ ఫుడ్ కూడా ఫ్రీ అనే ప్రకటనలు చూసేయడం ఖాయం అన్నమాట. అన్నట్టు అక్కడ ఇప్పటికే స్థలాలను అమ్మేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలూ ఉన్నాయని మనం వినే ఉన్నాం. ఇక మన రియల్ ఎస్టేట్ వ్యాపారుల తరువాతి అడ్డా చందమామే కావచ్చేమో? బీ రెడీ!

Also Read: Ice Age: మానవ మనుగడకు సంబంధించి వెలుగులోకి సంచలన నిజాలు.. వెల్లడించిన సైంటిస్టులు

Mars Quakes: అంగారకుడిపై కూడా ప్రకంపనలు.. ఒక నెలలోనే మూడు సార్లు వణికిన అరుణ గ్రహం