
కొత్త ఫార్చ్యూనర్ కోసం ఎదురుచూస్తున్న వారికి డిజైన్ మార్పులతో పాటు 48V మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Level-2 ADAS ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ఈ SUV భారత రోడ్లపై టెస్టింగ్‌లో కనిపించినట్లు సమాచారం. 2027లో దేశీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి కొత్త ఫార్చ్యూనర్‌లో ఎలాంటి మార్పులు ఉండనున్నాయి? అంచనా ధర ఎంత?
కొత్త తరం Toyota Fortuner బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందనుంది. కొత్త Toyota Hiluxతో కొన్ని కీలక భాగాలను పంచుకోనుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త బంపర్, సన్నని LED హెడ్‌లైట్లు ఉండనున్నాయి. వెనుకవైపు కొత్త టెయిల్‌గేట్ డిజైన్‌తో పాటు కనెక్టెడ్ LED లైట్ బార్‌ను అందించే అవకాశం ఉంది. కొత్త అల్లాయ్ వీల్స్, చతురస్రాకార వీల్ ఆర్చ్‌లు, బాడీ క్లాడింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి మార్పులు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.
క్యాబిన్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనున్నట్లు సమాచారం. వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే కొత్త ఫార్చ్యూనర్‌లో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌కు 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ 201 bhp పవర్, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండనున్నాయి. 4×2 రియర్ వీల్ డ్రైవ్‌తో పాటు 4×4 ఆప్షన్ కూడా అందుబాటులోకి రావచ్చు. మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థ వేగం పెంచే సమయంలో ఇంజిన్‌కు అదనపు సహాయం అందించడంతో పాటు బ్రేకింగ్ సమయంలో కొంత శక్తిని తిరిగి పొందుతుంది.
భద్రత కోసం Toyota Safety Sense Level-2 ADAS టెక్నాలజీని అందించే అవకాశం ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగులు, ABS, ESP, ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందించే అవకాశం ఉంది.
ధర విషయానికి వస్తే కొత్త Toyota Fortuner 2026 డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణ కానుంది. భారత మార్కెట్లో 2027 మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. దీని ప్రారంభ ధర సుమారు రూ.38 లక్షల నుంచి రూ.52 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అయితే డిజైన్, ఇంజిన్, ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలను టయోటా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.