Microsoft co-founder Bill Gates: స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం ఇంతలా వినియోగదారులు ఆకట్టుకుంటున్నాయి అంటే కారణం వీటిలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్, ఐఓస్ పోటాపోటీగా వినియోగదారులకు రకరకాల ఫీచర్లను తీసుకొస్తున్నాయి. అయితే సామాన్యంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించేది ఆండ్రాయిడ్ ఫోన్లనే విషయం మనకు తెలిసిందే.
ఎక్కువ మంది ధనవంతులు, డబ్బులు బాగా సంపాదించే వారు యాపిల్ ఫోన్లను (ఐ ఓస్) ఉపయోగిస్తారని చాలా మంది భావిస్తుంటారు. అయితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ఏ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తారో మీకు తెలుసా.? ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ తాను ఆండ్రాయిడ్ మొబైల్‌నే ఉపయోగిస్తానని తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో కొన్ని మైక్రోసాఫ్ట్‌కు చెందిన యాప్‌లు ఉండడమే దీనికి కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాను గతంలో యాపిల్ ఫోన్‌ను ఉపయోగించానని చెప్పిన గేట్స్ ప్రస్తుతం మాత్రం ఆండ్రాయిడ్ వాడుతున్నానని చెప్పుకొచ్చాడు. నేను అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లను పరిశీలించే క్రమంలో.. ఐఫోన్‌ను ఆపరేట్ చేస్తానని, కానీ బయటకు వెళ్లినప్పుడల్లా ఆండ్రాయిడ్ ఫోన్‌నే ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు. ఇక కొన్ని ఆండ్రాయిడ్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్లలో ప్రీ ఇన్‌స్టాల్ చేస్తున్నారని అది తనకు చాలా సౌకర్యవంతంగా మారుతుందని చెప్పారు. ఈ లెక్కన చూస్తుంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉండడమే గేట్స్ ఆండ్రాయిడ్ వాడడానికి కారణంగా చెప్పవచ్చు.