
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో స్వదేశీ తయారీ సంస్థ “లావా” తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకర్షిస్తూ దూసుకుపోతుంది. కాగా తక్కువ బడ్జెట్ లోనే వినియోగదారులను ఆకట్టుకునేలా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. Lava Smart 4 Pro పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్‌లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ ఉండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
కాగా బడ్జెట్ విభాగంలో వస్తున్నప్పటికీ Lava Smart 4 Pro ప్రీమియం లుక్‌ను అందించేలా ఫ్లాట్-ఎడ్జ్ బాడీ డిజైన్‌తో వస్తుంది. వెనుక వైపు కెమెరా మాడ్యూల్ చూస్తుంటే ఆపిల్ ఐఫోన్ (iPhone) డిజైన్ లానే అనిపిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఐఫోన్‌లలో మెటల్-గ్లాస్ బాడీ, డైనమిక్ ఐలాండ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండగా.. లావా స్మార్ట్ 4 ప్రోలో బడ్జెట్‌కు తగ్గట్టుగా పాలికార్బోనేట్ బాడీ, ముందువైపు వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఇచ్చారు. దీనితో పాటు MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్రాప్, షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల, సాధారణ కిందపడటాల నుండి ఫోన్‌కు అదనపు రక్షణ లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 17.13 సెంటీమీటర్ల (6.75 అంగుళాల) పెద్ద HD+ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది, తద్వారా స్క్రోలింగ్ మరియు వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ 7,000mAh Li-Ion బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 950 గంటల వరకు స్టాండ్‌బై టైమ్, 748 నిమిషాల వరకు నిరంతరాయంగా యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, USB Type-C పోర్టును ఇచ్చారు.
ఈ కొత్త ఫోన్‌లో UNISOC T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4GB ఫిజికల్ RAMతో పాటు అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్ ఉండటంతో మొత్తం 8GB వరకు RAM పనితీరును పొందవచ్చు. 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకునే వీలుంది.
ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు LED ఫ్లాష్‌తో కూడిన 13MP ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్ సపోర్ట్‌తో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ లేటెస్ట్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి ప్రకటనలు (Ads) లేదా అనవసరమైన యాప్స్ (Bloatware) ఉండవని లావా స్పష్టం చేసింది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లతో పాటు రెండేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ అందిస్తారు.
4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది.
Neelam Blue, Konark Gold రంగుల్లో లభిస్తుంది.
అయితే ఆన్‌లైన్ కంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న లావా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా ఫోన్‌పై ఒక సంవత్సరం, యాక్సెసరీస్‌పై 6 నెలల వారంటీతో పాటు ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ అందించే Free Service @ Home సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది.