
పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన SUVలకు కూడా భారత మార్కెట్లో ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో JSW Combat ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే అవకాశం ఉందన్న సమాచారం ఆసక్తికరంగా మారింది. శక్తివంతమైన ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లు, ఆధునిక టెక్నాలజీతో ఈ SUVని తీసుకురావచ్చని అంచనా. అయితే ధర, పూర్తి ఫీచర్లు, భారత్‌లో అందించే పవర్‌ట్రెయిన్ వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
JSW మోటార్స్ విడుదల చేసిన టీజర్‌లో ఆరెంజ్ బ్యాక్‌గ్రౌండ్‌పై Combat SUV ముందు భాగాన్ని చూపించింది. ‘A moment that moves Bharat’ అనే క్యాప్షన్‌తో ఈ టీజర్‌ను విడుదల చేసింది. ఫ్రంట్ గ్రిల్‌పై పెద్ద అక్షరాలతో COMBAT పేరు కనిపిస్తోంది. స్క్వేర్డ్ హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌లు, వరుసగా అమర్చిన లైటింగ్ ఎలిమెంట్స్, ఫ్లాట్ బానెట్, నిటారుగా ఉండే విండ్‌షీల్డ్ దీని బాక్సీ లుక్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. భారీ ఫ్రంట్ బంపర్, లోయర్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు కూడా ఉన్నాయి.
స్పై ఫొటోల్లో వెనుక భాగం లేత నీలం, ఆకుపచ్చ రంగుల మిశ్రమ షేడ్‌లో కనిపించింది. టెయిల్‌గేట్‌పై JSW బ్రాండింగ్, స్పేర్ వీల్ కవర్‌పై COMBAT పేరు ఉన్నాయి. నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్స్, బ్లాక్ క్లాడింగ్‌తో కూడిన రియర్ బంపర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, రియర్ వైపర్, సైడ్ స్టెప్స్, మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తున్నాయి.
JSW Combat SUV జెటూర్ T2 ఆధారంగా రూపొందించిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్‌ట్రెయిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 18.4kWh బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండవచ్చని సమాచారం. ఈ సెటప్ గరిష్ఠంగా 360bhp పవర్, 610Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా. విదేశీ వెర్షన్‌లో మూడు స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు శక్తి అందుతుంది. ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 90 కిలోమీటర్లు, పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ కలిపి సుమారు 1,100 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది. అయితే భారత్‌లోని మోడల్‌కు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. AWD వెర్షన్ వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇంటీరియర్‌లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండవచ్చని అంచనా. పవర్డ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, సరౌండ్ వ్యూ కెమెరా, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు కూడా అందించవచ్చని సమాచారం. ఈ SUV పొడవు సుమారు 4.8 మీటర్లు ఉండనుంది. ధర విషయానికి వస్తే రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండవచ్చని మార్కెట్ అంచనా. డిసెంబర్ 3న జరిగే ఆవిష్కరణ కార్యక్రమంలో ధర, వేరియంట్లు, బుకింగ్స్, డెలివరీ వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.