
టెక్ ప్రపంచానికి ఒక పెద్ద ముప్పు పొంచి ఉందని గూగుల్ హెచ్చరించింది. హ్యాకర్లు ఇప్పుడు టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఈమెయిల్‌లతో దాడి చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఇంక్.కి చెందిన గూగుల్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఈమెయిల్‌లు ఒరాకిల్ ఈ-బిజినెస్ సూట్ నుండి సున్నితమైన డేటాను దొంగిలించాయని, కంపెనీలు డబ్బులు చెల్లించకపోతే ఈ డేటాను పబ్లిక్ చేస్తామని బెదిరిస్తున్నాయని గూగుల్ వెల్లడించింది. అతిపెద్ద ఆందోళన ఏమిటంటే.. ఈ ఈమెయిల్‌లు గతంలో పెద్ద ఎత్తున సైబర్ దాడులను నిర్వహించిన అపఖ్యాతి పాలైన క్లోప్ రాన్సమ్‌వేర్ గ్రూపుతో ముడిపడి ఉన్నాయి.
గూగుల్ ప్రకారం.. హ్యాకర్లు అనేక కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఒరాకిల్ బిజినెస్ అప్లికేషన్స్ నుంచి ఫైనాన్స్, ఆపరేషన్స్ డేటాను దొంగిలించారని చెబుతూ ఇమెయిల్‌లు పంపుతున్నారు. అయితే డేటా వాస్తవానికి దొంగిలించబడిందని ఇంకా ఎటువంటి ఆధారాలు లేవని గూగుల్ స్పష్టం చేసింది. ఇది కేవలం కంపెనీలను బెదిరించి వారి నుండి డబ్బును దోచుకునే వ్యూహం కావచ్చని అభిప్రాయపడింది.
అయితే ఈ ఇమెయిల్‌ల ద్వారా ఎన్ని కంపెనీలు లేదా ఏ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారో గూగుల్ ఇప్పటివరకు వెల్లడించలేదు. పరిస్థితి అస్పష్టంగానే ఉన్నప్పటికీ, క్లోప్ వంటి రాన్సమ్‌వేర్ గ్రూపులు నిరంతరం కొత్త వ్యూహాలను అభివృద్ధి చేస్తున్నాయి. కార్పొరేట్ డేటాను – లేదా దానిని కలిగి ఉన్నారనే వాదనను – శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కంపెనీలు కీలకమైన ఫైనాన్స్, ఆపరేషనల్ డేటాను భద్రపరచడానికి ఒరాకిల్ ఈ-బిజినెస్ సూట్‌ను ఉపయోగిస్తాయి. ఈ డేటా లీక్ అయితే, లేదా లీక్ క్లెయిమ్ పబ్లిక్ అయితే కంపెనీలు గణనీయమైన ఆర్థిక నష్టాలను చవిచూడటమే కాకుండా వాటి బ్రాండ్ విలువ, ఖ్యాతిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి