
AI రంగంలో మరో పెద్ద అడుగు పడింది. గూగుల్ తన జెమిని చాట్‌బాట్ సామర్థ్యాలను విస్తరించి, వినియోగదారులు చాట్‌లోనే నేరుగా ఒరిజినల్ సంగీతాన్ని సృష్టించే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లైరియా 3 (Lyria 3) అనే అధునాతన మ్యూజిక్ మోడల్‌పై ఆధారపడిన ఈ ఫీచర్‌ను గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసింది. ఈ అప్‌డేట్‌తో వినియోగదారులు కేవలం ఒక ప్రాంప్ట్ టైప్ చేస్తే సరిపోతుంది — జెమిని స్వయంచాలకంగా సుమారు 30 సెకన్ల ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్‌ను రూపొందిస్తుంది. కావాలంటే ఫోటో లేదా చిన్న వీడియోను అప్‌లోడ్ చేసి కూడా సంగీతాన్ని తయారు చేయించుకోవచ్చు. ఇచ్చిన ఇన్‌పుట్‌కు అనుగుణంగా AI స్వయంగా ట్యూన్, బీట్, అవసరమైతే లిరిక్స్ కూడా రూపొందిస్తుంది.
లైరియా 3 పాత మోడళ్లతో పోలిస్తే మరింత సహజమైన, లేయర్డ్ సంగీతాన్ని సృష్టిస్తుందని గూగుల్ చెబుతోంది. వినియోగదారులు పాట శైలి, టెంపో, వేగం, వోకల్ టోన్ వంటి అంశాలను తమ ఇష్టానికి అనుసరించి మార్చుకోవచ్చు. అయితే ఇది ప్రొఫెషనల్ మ్యూజిక్ ప్రొడక్షన్‌కు ప్రత్యామ్నాయం కాదని, సృజనాత్మక వినోదం కోసం రూపొందించిన సాధనమని కంపెనీ స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 19 నుంచి ఈ ఫీచర్‌ను దశలవారీగా విడుదల చేస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వినియోగదారులకు ఇది అందుబాటులో ఉండగా, హిందీతో పాటు ఎనిమిది భాషలకు మద్దతు ఉంది. ప్రారంభంలో డెస్క్‌టాప్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయం త్వరలో మొబైల్‌కు విస్తరించనుంది. AI ప్లస్, ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు అధిక వినియోగ పరిమితులు ఉంటాయి. ఇదిలా ఉండగా యూట్యూబ్ క్రియేటర్ల కోసం కూడా లైరియా 3ను ‘డ్రీమ్ ట్రాక్’లో అనుసంధానిస్తున్నారు. ముఖ్యంగా ఈ టూల్ ఎలాంటి గాయకుడి స్వరాన్ని అనుకరించదని, పూర్తిగా ఒరిజినల్ సంగీతాన్నే సృష్టిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి