Fish Rain: ఆకాశం నుంచి చేపల వర్షం.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా?

ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం నుంచి చేపలు పడ్డాయనే వార్తలు చూస్తున్నాం. చాలా అరుదుగా కొన్ని ప్రాంతాల్లోనే ఇలా చేపల వర్షం కురుస్తుంది. ఏపీ, తెలంగాణలోనూ చేపల వర్షం కురిసిన సందర్భాలూ ఉన్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ అప్పుడప్పుడు ఇలా జరుగుతోంది. అయితే, అమెరికా ఖండంలోని ఓ ప్రాంతంలో మాత్రం తరచుగా ఇలా చేపల వర్షం పడుతోంది. దీంతో అక్కడి ప్రజల దీన్ని పండగలా జరుపుకుంటారు. అయితే, చేపల వర్షం కురిసేందుకు కారణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.

Fish Rain: ఆకాశం నుంచి చేపల వర్షం.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా?
Fish Rain

Updated on: Jan 03, 2026 | 10:32 AM

వడగళ్ల వానలు సాధారణంగా చూస్తేనే ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అరుదైన సందర్భాల్లో చేపలు ఆకాశం నుంచి పడటం కూడా చూశాం. ఇవి చాలా తక్కువ పరిణామంలో ఉంటాయి. అయితే, అమెరికాలో మాత్రం పెద్ద మొత్తంలో చేపలు ఆకాశం నుంచి పడుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలు దాన్ని ఓ పండగలు జరుపుకుంటున్నారు. చేపలు ఆకాశంలో ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి వనరులపై ఏర్పడే శక్తివంతమైన సుడిగాలులు, సుడిగుండాలు ఆ నీటి నుంచి చేపలను పీల్చుకుని వాటిని భూమికి తీసుకుని వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

చేపల వర్షం ఎలా కురుస్తుంది?

టెక్సాస్‌‌లోని టెక్సార్కానాలో చేపలు పెద్ద మొత్తంలో ఆకాశం నుంచి వర్షంలా కురిశాయి. వాస్తవానికి చేపలు ఆకాశం నుంచి పడవు. భారీ సరస్సులు, సముద్రంపై సుడిగుండాలు ఏర్పడినప్పుడు చేపలు.. గాలిలోకి తీసుకెళ్లబడతాయి. ఆ తర్వాత కొంత సమయానికి సుడిగాలి ప్రభావం తగ్గిన తర్వాత చేపలు కిందపడతాయి. ఇదే మనకు చేపల వర్షంలా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో చేపలతోపాటు కప్పలు, పాములు, పీతలు మొదలైన చిన్న జంతువులు కూడా వచ్చి పడతాయి.

కాలిఫోర్నియా, వాయువ్య సైబీరియాలో ఇటువంటి జంతు వర్షం కురిసిన సందర్భాలున్నాయి. మనదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో పలు సందర్భాల్లో చేపల వర్షం కురిసింది. 2019లో కేరళలో ఒకసారి చేపల వర్షం కురిసింది. వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా అరుదుగా ఇలా జరిగింది. 2022లో తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో ఆకాశం నుంచి చేపల వర్షం కురిసింది. ఈ వింతతో అక్కడి ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారు. 2021లో యూపీలోని పటోహి జిల్లాలో కూడా చేపల వర్షం కురిసింది. ఇలాంటివి వర్షకాలంలోనే ఎక్కువగా చోటు చేసుకుంటాయి.

హోండురాస్‌లోని యోరో నగరంలో పండగలా చేపల వర్షం

చేపలను తీసుకెళ్లేంత బలంగా సుడిగాలులు ఉంటే ఇలాంటి చేపల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే, అమెరికా ఖండం హోండురాస్‌లోని యోరో నగరంలో మాత్రం ప్రతీ సంవత్సరం ఈ చేపల వర్షం కురుస్తుంది. దీంతో ఈ నగరం చేపల వర్షానికి ప్రసిద్ధిగా మారింది. చేపల వర్షాన్ని లువియా డి పెసెస్ అని కూడా అంటారు. సాధారణంగా ఏడాదిలో ఒకటి రెండుసార్లు ఇలా జరుగుతుంది. మే, జులై మధ్య కాలంలో ఎక్కువగా ఈ చేపల వర్షం కురుస్తుంది. ఆ చేపలను పట్టుకెళ్లి వండుకుని తింటారు. అక్కడి ప్రజలు దీన్నీపండగలా జరుపుకుంటారు.

శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

సముద్రాలు, మహా సరస్సుల్లో శక్తివంతమైన సుడిగుండాలు ఏర్పడినప్పుడు.. వాటి ద్వారా చేపలు భూమిపైకి వర్షం రూపంలో తీసుకురాబడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొంత తక్కువ బరువున్న చేపలు, జీవులను ఈ సుడిగుండాలు ఆకాశంలోకి తీసుకెళ్లి బలహీనంగా మారినతర్వాత భూమిపైకి వదలిపెడతాయి. దీంతో ఆకాశం నుంచి చేపల వర్షం కురిసినట్లుగా మనకు కనిపిస్తుంది. అంతేగాక, చేపలు ఆకాశంలో ఉండవని చెబుతున్నారు.