
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర పరికరంగా మారిపోయింది. ఒక్క నిమిషం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మానవుల జీవితంలో ఫోన్ అనేది ఒక భాగమైపోయింది. మార్కెట్లోకి కొత్త టెక్నాలజీతో కూడిన అప్‌గ్రేడ్ వెర్షన్లు ఫోన్లు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్ ప్రియులు పాత ఫోన్లను ఎక్సేంజ్‌లో విక్రయించి కొత్త ఫోన్లను తీసుకుంటూ ఉంటారు. అయితే కొత్త ఫోన్లను తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల దొంగలించిన ఫోన్లను కూడా కొత్త ఫోన్ అంటూ కస్టమర్లకు అంటగడుతున్నారు. దీంతో మీరు కొంటున్నది కొత్త ఫోనా..? లేదా దొంగలించిన ఫోన్‌నా? అనేది తెలుసుకోవాలి. ఎలాంటి టిప్స్ పాటించాలో ఒకసారి చూద్దాం.
అంతర్జాతీయ మొబైల్ పరికర గుర్తింపు(ఐఎంఈఐ) నెంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ప్రతీ ఫోన్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్‌ను కేటాయిస్తారు. దీనినే ఐఎంఈఐ నెంబర్‌గా పిలుస్తారు. ఇది 15 అంకెలతో ఉంటుంది. మీ ఫోన్ చట్టబద్దమైనదా.. లేదా అనేది తెలుసుకోవడానికి మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు దీని ద్వారా తెలుసుకుంటాయి. దీంతో ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్‌ను చెక్ చేసుకోవాలి.
ఐఎంఈఐ నెంబర్ తనిఖీ చేసుకోకుండా కొనుగోలు చేస్తే మీరు భవిష్యత్తులో సమస్యల్లో పడొచ్చు. ఇటీవల దొంగలించిన ఫోన్లను, డూప్లికేట్ లేదా కోన్ల్ చేయబడిన ఐఎంఈఐ ఫోన్లను విక్రయిస్తున్నారు. ఇక ఇప్పటికే ఐఎంఈఐ నెంబర్‌ను బ్లాక్ చేసిన ఫోన్లు కూడా అమ్ముతున్నారు. ఇలాంటి ఫోన్లు ఏ నెట్ వర్క్‌లో పనిచేయవు. దీంతో మీరు కేసుల్లో చిక్కుకుని చట్టపరంగా చిక్కుల్లో పడే అవకాశముంది. దొంగ ఫోన్లను తక్కువ ధరకే విక్రయిస్తూ ఉంటారు. దీంతో తక్కువ ధరకు వస్తున్నాయనే ఆశతో వీటిని కొనుగోలు చేసి సమస్యల్లో పడతారు. పొగొట్టుకున్న ఫోన్లు, దొంగలించి ఫోన్లను CEIR సిస్టమ్ ద్వారా బ్లాక్ చేస్తారు. మరోసారి ఆ ఫోన్ ఉపయోగించకుండా నిరోధిస్తారు.
-ఫోన్‌లో *#06# డయల్ చేయడం ద్వారా చెక్ చేసుకోవచ్చు
-KYM అని టైప్ చేసి 14422 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా తనిఖీ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది
-ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంచార్ సౌధీ యాప్, వెబ్ సైట్ ద్వారా కూడా ధృవీకరణ చేసుకోవచ్చు
-కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలి. లేకపోతే చిక్కుల్లో పడి మీరు జైలుకు వెళ్లాల్సి రావొచ్చు