Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

చేయాల్సిందెంతో వుంది మోదీ జీ.. !!

swachha bharath open defacation narendra modi big task, చేయాల్సిందెంతో వుంది మోదీ జీ.. !!

స్వచ్ఛభారత్ కానీ.. బహిరంగ మల,మూత్ర విసర్జన లేని దేశంగా మార్చాలన్న సంకల్పం కానీ ఏ మాత్రం విమర్శించదగినవి కాదు. అలాగని ఎంతో కొంత చేసి.. అంతా అయిపోయిందని చాటుకునేంత చిన్న లక్ష్యాలు ఎంత మాత్రం కాదు. సువిశాల భారత దేశంలో ఈ రెండు లక్ష్యాలు 4,5 ఏళ్ళలో సాధించే లక్ష్యాలు ఎంత మాత్రం కావు. కానీ.. మొన్నటికి మొన్న మొత్తం భారత దేశమంతటా బహిరంగ మల విసర్జన మచ్చుకైనా లేకుండా చేయగలిగామని ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లో 20,000 మంది గ్రామ పెద్దల సమక్షంలో చేసిన ప్రకటన కలా, నిజామా అనే సందిగ్ధ స్థితిలో పడేసింది. పేదరికానికి నిలయమై.. అత్యధిక జనాభా గల సువిశాల భారత దేశంలో ఈ లక్షాన్ని సాధించగలగడం అనుకునేంత సులువైంది కాదు. కాని దానినొక దీక్షగా చేపట్టి అమల్లోకి తీసుకు రావడానికి ప్రధాని మోడీ సంకల్పం చెప్పుకున్న తీరు గణనీయమైనది. స్వచ్ఛ భారత్ పేరిట ఆయన ఇందు కోసం చేసిన ప్రచారం సాధారణమైనది కాదు, ఇంత వరకు దేశంలోని ఏ నేతా ఈ పని చేయలేదనడం అతిశయోక్తి కానేరదు. పారిశుద్ధానికి మహాత్మా గాంధీ ఇచ్చిన ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. దాదాపు అదే స్థాయిలో మోదీ ప్రచారం చేసుకున్నారు.

ఆయన స్వచ్ఛ భారత్ స్వప్నాన్ని పరిపూర్ణంగా సాధించగలిగామని ఈ కార్యక్రమం చేపట్టి ఐదేళ్లు నిండిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించుకున్నారు. ప్రధాని చెప్పిన దానిని బట్టి గత 60 మాసాల్లో 60 కోట్ల మందికి ఆధునిక మరుగు దొడ్ల సదుపాయాన్ని కలిగించారు, దేశ వ్యాప్తంగా 11 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతుంది. మరుగు దొడ్ల సౌకర్యాన్ని కల్పించడం, బహిరంగ మల విసర్జనను అంతమొందించడం ఒకటేనని భావించమంటున్నారు ప్రధాని మోడీ. కాని రెండింటికీ మధ్య గల తేడా గురించి వివరించి చెప్పనక్కర లేదు. సగానికి పైగా బడుగు, బలహీన వర్గాల ప్రజలున్న దేశంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన అలవాటు చిరకాలంగా స్థిరపడిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అది సర్వసాధారణమైపోయింది. ఈ విషయంలో మహిళలు ఇప్పటికీ అత్యంత అసౌకర్యాన్ని అభద్రతాయుత వాతావరణాన్ని భరించాల్సి వస్తుంది.

బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, వారి హాస్టళ్లల్లో బాలికలకు సరైన మరుగు దొడ్లు లేని దయనీయ పరిస్థితి కొనసాగుతున్నది. అవసరం తీర్చుకోడానికి బయటికి వెళ్లి పురుగు, పుట్రా కాటుకు దొరికిపోడం, దుండగుల అపహరణకు గురవడం కూడా జరుగుతున్నది. అలాగే తల దాచుకోను గట్టి గూడు లేక గుడిసెల్లో బతికే జనాభాకు దేశంలో కొదువ లేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆధునిక మరుగు దొడ్లను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించడం దుస్సాహసమే అవుతుంది. స్వయంగా ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు కాబట్టి అది అందరి దృష్టినీ తప్పని సరిగా ఆకర్షిస్తుంది. మరుగు దొడ్లు నిర్మించి ఇచ్చినంత మాత్రాన అయిపోయే వ్యవహారం కాదిది. వాటిల్లో తగిన నీటి సౌకర్యం ఉండాలి. విద్యుత్తు ఉండాలి. వాటికి తగిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కావాలి. మరుగు దొడ్లను ఇతరత్రా అవసరాలకు వాడకుండా తప్పని సరిగా మల విసర్జనకే వినియోగించుకునేలా ఆ ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలి.

2017లోనే బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా ప్రకటించుకున్న హర్యానాలో ప్రజలు మళ్లీ ఆ పాత అలవాటుకే మళ్లిపోతున్నారని ఇటీవల జరిపిన ఒక సర్వే కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడించింది. అనేక మురికి వాడలకు నిలయమైన ముంబై వంటి మహానగరాల్లో బహిరంగ మల విసర్జన బందయిందనడం అతిశయోక్తే అవుతుందని పలువురు పెద్దలు ఎత్తి చూపిస్తున్నారు. అందుచేత బహిరంగ విసర్జన లేని దేశంగా ప్రకటించుకోడం సకల ప్రచారార్భాట సౌకర్యాలు గల ప్రభుత్వాలకు సుళువే గాని దానిని రుజువు పరుచుకోడం మాత్రం అంత అనాయాస వ్యవహారం కాదు. అది జన జీవన కఠోర వాస్తవాల అద్దంలో అబద్ధంగానే రుజువవుతుంది.

గత అయిదేళ్ళలో ప్రభుత్వాలు చేసిందానికంటే చెప్పుకున్నదే ఎక్కువ. ఈ విషయంలో ఒక్క కేంద్ర ప్రభుత్వాన్నే నిందించలేం. రాష్ట్రాలు తమ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేదంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు.. స్వచ్ఛ భారత్ ప్రారంభమైన తొలి నాళ్ళలో హైదరాబాద్ తొలి రెండేళ్ల బెటర్ పర్ఫార్మర్గా అవార్డులందుకుంది. ఆ తర్వాత నిర్లక్ష్యం ఆవహించినందువల్ల హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నడి రోడ్డు మీద చెత్త పేరుకుపోయి తెల్లవారితే ముక్కు మూసుకుని దాటాల్సిన దుస్థితి కనిపిస్తోంది. స్వచ్ఛ భారత్ కానీ.. బహిరంగ మల,మూత్ర విసర్జనారహిత సమాజాన్ని నిర్మించడం గానీ.. కేంద్ర, రాష్ట్రాల సమిష్టి బాధ్యత. అదే సమయంలో పౌరులు కూడా స్వచ్ఛందంగా ఇందుకు కట్టుబడిన నాడే సంకల్పం నెరవేరుతుంది. అంతే గానీ ఆర్భాటపు ప్రకటనలతో లాభం లేదని ఏలికలు గుర్తించాలి.