TV9 CBC 2026 : హైదరాబాద్‌లో టీవీ9 కార్పోరేట్ బ్యాడ్మింటన్ వార్.. తొలిరోజే హోరాహోరీ పోరు

TV9 CBC 2026 : టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్ 2(CBC) నేడు (మే 15, 2026) హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పండుగలో తొలిరోజే అద్భుతమైన రికార్డులు నమోదవుతున్నాయి.

TV9 CBC 2026 : హైదరాబాద్‌లో  టీవీ9 కార్పోరేట్ బ్యాడ్మింటన్ వార్.. తొలిరోజే హోరాహోరీ పోరు
Tv9 Badminton (4)

Updated on: May 15, 2026 | 1:50 PM

TV9 CBC 2026 : కంప్యూటర్ స్క్రీన్ల ముందు కోడింగ్‌తో కుస్తీ పట్టే సాఫ్ట్‌వేర్ బాబులు ఇప్పుడు రాకెట్ చేతబట్టి కోర్టులో చెమటోడుస్తున్నారు. టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీజన్ 2(CBC) నేడు (మే 15, 2026) హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పండుగలో తొలిరోజే అద్భుతమైన రికార్డులు నమోదవుతున్నాయి. ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఒకరిపై ఒకరు స్మాష్‌లతో విరుచుకుపడుతున్నారు.

తొలిరోజు ఫలితాలు

నేడు జరిగిన ప్రారంభ మ్యాచ్‌లలో పలు ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. కోర్టు-1లో జరిగిన మ్యాచ్‌లో గ్లాన్స్ (Glance) టీమ్ తరపున ఆడిన ప్రజ్వల్, కాగ్నిజెంట్ ప్లేయర్ డీఏ నాయుడుపై 15-7, 15-6 తేడాతో ఘన విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి దూసుకెళ్లారు. అటు మహిళల విభాగంలో కోర్టు-2లో శైలజ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆమె అయేషాపై 15-3, 15-0 తో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి మ్యాచ్ విన్నర్‎గా నిలిచారు. అలాగే కోర్టు-5లో నెక్సస్ ఐక్యూ సొల్యూషన్స్ జట్టు 15-6, 15-6తో ఐఎన్ఎన్ టెక్ గ్లోబల్ వాల్యూ ప్రైవేట్ లిమిటెడ్ పై గెలుపొందింది.

హోరాహోరీగా సాగుతున్న లైవ్ మ్యాచ్‌లు

ప్రస్తుతం కోర్టుల్లో పలు కీలక మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. కోర్టు-8లో సేపియన్స్(Sapiens)కు చెందిన వినయ్ మీద ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్లేయర్ నిశాంత్‌ 15-8, 15-5 తేడాతో గెలిచారు.. అలాగే కోర్టు-7లో ఇన్‌ఫోర్ ఇండియా (Infor India), బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ (Brigade Enterprises) జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కోర్టు-3లో భువన్ (వేదాంత), సాయి సందీప్ (FINMKT) మధ్య జరిగిన పోరులో సాయి సందీప్ 15-8, 15-8తో సత్తా చాటారు.

ఉదయం నుంచి జరిగిన హోరాహోరీ పోరులో మెన్ సింగిల్స్ విభాగంలో పలువురు ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను చిత్తు చేసి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ ప్రతినిధులు కోర్టులో రాకెట్లతో విన్యాసాలు చేస్తూ విజేతలుగా నిలిచారు.

తదుపరి రౌండ్‌కు చేరిన విజేతలు వీరే

మెన్ సింగిల్స్ విభాగంలో తమ అద్భుతమైన స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థులకు చమటలు పట్టించిన కింది ఆటగాళ్లు తర్వాతి రౌండ్‌లోకి ప్రవేశించారు:

కాగ్నిజెంట్ : వాసా దీక్షణానందుడు తనదైన శైలిలో ఆడి విజయాన్ని అందుకున్నారు.

మైక్రోసాఫ్ట్ : ఈ సంస్థ నుంచి ఇద్దరు ఆటగాళ్లు సత్తా చాటారు. శిశిర్ గార్గ్, అనిల్ కుమార్ తమ మ్యాచ్‌లలో గెలిచి ముందడుగు వేశారు.

టీసీఎస్ : తోకల కౌశిక్ తన వేగవంతమైన ఆటతీరుతో తర్వాతి రౌండ్‌కు క్వాలిఫై అయ్యారు.

ఎంఫాసిస్ : సిద్ధిక్ అలీ అద్భుత పోరాట పటిమ కనబర్చి విజేతగా నిలిచారు.

హెచ్‌సీఎల్ టెక్ : హేమగురు సాయి తన టెక్నిక్స్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసి నెక్స్ట్ రౌండ్‌కు చేరారు.

పల్స్ ఫార్మాస్యూటికల్స్ : శ్రీకృష్ణ ఫార్మా రంగం తరపున గట్టి పోటీని ఇచ్చి విజయం సాధించారు.

నాట్కో రీసెర్చ్ సెంటర్ : ఎస్. సాయి రామ్ కూడా అద్భుత ప్రదర్శనతో క్వాలిఫై అయ్యారు.

ప్రస్తుతం కోర్టులో ఇదే ఊపు కొనసాగుతోంది. క్వాలిఫై అయిన ఆటగాళ్లు తదుపరి రౌండ్‌లో మరిన్ని సవాల్‌లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ గెలుపు జోరు చూస్తుంటే ఫైనల్స్ వరకు పోటీ మరింత తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది.

గోపీచంద్ మార్గదర్శకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలు

దేశంలోనే అత్యుత్తమ బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రమైన గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరగడం విశేషం. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ స్వయంగా ఈ ఈవెంట్‌ను పర్యవేక్షిస్తుండటంతో మ్యాచ్‌లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ వంటి టాప్ కంపెనీల నుండి దాదాపు 300 మందికి పైగా ప్లేయర్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. గెలిచిన విజేతలకు ట్రోఫీలతో పాటు మొత్తం రూ.5 లక్షల భారీ ప్రైజ్ మనీని టీవీ9 నెట్‌వర్క్ అందించనుంది. కేవలం పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, కార్పొరేట్ కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన క్రీడా వాతావరణాన్ని ఈ టోర్నీ సృష్టిస్తోంది.

Follow Us