ఐసీసీ వన్డే ప్రపంచకప్ తరువాత ధోనీ పరిస్థితే ఎవరికీ అర్థం కావడం లేదు. రిటైర్ అవుతాడా? ఇంకా ఆటలో కొనసాగుతాడా? ఎంతకాలం? జట్టులో ఇప్పుడతని పాత్ర ఏంటి? ఇలా ఎడతెగని చర్చ జరుగుతోంది. భవిష్యత్తుపై తన ఉద్దేశమేంటో ధోనీనే అడిగితే సరిపోతుందిగా అంటున్నారు మాజీ చీఫ్ సెలక్టర్లు, ఆటగాళ్లు.
వెస్టిండీస్ పర్యటన కోసం త్వరలో బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ ఐదుగురు సెలక్టర్లకు కనీసం 50 వన్డేల అనుభవం లేదు. 350 వన్డేల అనుభవం ఉన్న ఎంఎస్ ధోనీని వారు ప్రశ్నించగలరా? ఎంపిక చేయకుండా ధైర్యం చేయగలరా? అన్నది సందేహమే. అందుకే సెలక్టర్లకు ధైర్యం, ఆత్మవిశ్వాసం అవసరమని అంటున్నారు మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్. ‘ఆటగాళ్ల ప్రదర్శనలను సమీక్షించి భవిష్యత్తుకు బాటలు వేయడమే సెలక్టర్ల పని. టెస్టు, వన్డే, టీ20 సమూహంలోకి ఏయే ఆటగాళ్లు వస్తారో కచ్చితంగా తెలుసుండాలి. వారి ఆటతీరు పరిశీలించి రిజర్వు బెంచి సామర్థ్యాన్ని గుర్తించి అవకాశాలు సృష్టించాలి. భవిష్యత్తు కోసం సలహాలు తీసుకోవడమూ అవసరమే’ అని వెంగీ అంటున్నారు. 2007 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ నుంచే టీమిండియా తిరిగొచ్చిన తర్వాత వెంగీ సెలక్షన్ బాధ్యతలు చేపట్టారు. స్వదేశంలో ప్రపంచకప్ గెలిచేవరకు కొనసాగారు.