Paris Olympics 2024: జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు జ్యోతి యర్రాజీ (24), దండి జ్యోతిక శ్రీ (23) చోటు దక్కించుకున్నారు. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో వైజాగ్ హర్డిలర్ జ్యోతి పాల్గొంటుంది. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక శ్రీ 4×400 మీటర్ల రిలే టీమ్‌లో పాల్గొంటుంది. ఇద్దరు అథ్లెట్లు వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు.
జ్యోతి పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కాగా, తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. మరోవైపు, జ్యోతిక శ్రీ డాక్టర్ కావాలనుకుంది. అయితే మాజీ బాడీబిల్డర్ అయిన ఆమె తండ్రికి ఉన్న అభిరుచి మేరకు అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది.
బహామాస్‌లో జరిగిన ఫైనల్ క్వాలిఫికేషన్‌లో 51.36 సెకన్ల టైమింగ్‌తో దూసుకెళ్లిన జ్యోతిక ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అథ్లెటిక్స్ అత్యున్నత దశలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారులను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ‘‘ఎన్నో ఏళ్లపాటు శ్రమకు ఫలితం దక్కింది. వారు ఒలంపిక్స్‌లో తమ పతక కలను అచంచలమైన సంకల్పంతో సాధిస్తారని అనుకుంటున్నాను. వారిద్దరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. వారు మనందరినీ గర్వపడేలా చేస్తారని నమ్ముతున్నాను”అంటూ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
తాజాగా అప్‌డేట్ చేసిన ప్రపంచ అథ్లెటిక్స్ క్వాలిఫైడ్ అథ్లెట్ల జాబితాలో జ్యోతి యర్రాజీ ఒలింపిక్స్‌లో మొదటి భారతీయ 100 మీటర్ల హర్డిలర్‌గా అవతరించింది. కాగా, జ్యోతి యర్రాజీ ఈ గేమ్స్‌లో మొదటి భారతీయ 100 మీటర్ల హర్డిలర్‌గా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..