చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి మహిళగా రికార్డ్..

భారత రెజ్లింగ్ చరిత్రలో 14 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2010లో దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి స్వర్ణం అందించిన రెండో రెజ్లర్‌గా, తొలి మహిళగా మనీషా భన్వాలా సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల 59 కేజీల విభాగంలో జరిగిన తుది పోరులో అసాధ్యమనుకున్న స్థితి నుంచి పుంజుకుని అమెరికా క్రీడాకారిణి అబిగైల్ నెట్టెను చిత్తు చేసిన తీరు ప్రతీ భారతీయుడూ గర్వపడేలా చేసింది.

చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి మహిళగా రికార్డ్..
Manisha Bhanwala Scripts History

Updated on: Oct 30, 2026 | 8:58 PM

భారత మహిళా రెజ్లింగ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ రెజ్లర్ మనీషా భన్వాలా చారిత్రక స్వర్ణ పతకంతో మెరిసింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో 2010లో దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా మనీషా నిలిచింది. మహిళల 59 కేజీల విభాగంలో జరిగిన తుది పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. అమెరికాకు చెందిన పాన్ అమెరికన్ ఛాంపియన్ అబిగైల్ నెట్టెతో జరిగిన ఈ ఫైనల్ బౌట్‌లో మనీషా తన అసమాన పోరాట పటిమను చాటింది. ప్రారంభంలో ప్రత్యర్థి దూకుడు ప్రదర్శించడంతో మనీషా ఏకంగా 0-6తో తీవ్రంగా వెనుకబడింది. నెట్టె వేసిన పట్టుతో మనీషా వరుస పాయింట్లు కోల్పోయింది. రెజ్లింగ్ నిపుణులు సైతం మ్యాచ్ చేయిదాటిపోయిందనుకున్న వేళ.. మనీషా ఉక్కు సంకల్పంతో బరిలోకి దిగింది.

సెకండ్ పీరియడ్‌లో మెరుపు దాడి

రెండో పీరియడ్ ప్రారంభం కాగానే మనీషా సరికొత్త వ్యూహంతో విరుచుకుపడింది. ప్రత్యర్థి చేసిన లెగ్ ఎటాక్‌ను సమర్థవంతంగా తిప్పికొడుతూ వెనుక నుంచి దాడి చేసి టేక్‌డౌన్ సాధించింది. ఆ తర్వాత పాయింట్ల వేటలో దూకుడు పెంచుతూ గట్ రెంచ్ ద్వారా స్కోరును 6-6 వద్ద సమం చేసింది. మ్యాచ్ ముగిసే సమయానికి మరో రెండు పాయింట్లు సాధించి 8-6తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

చివరి క్షణాల్లో ఉక్కు రక్షణ.. స్వర్ణంతో ముగింపు

మ్యాచ్‌లో కేవలం 27 సెకన్లు మిగిలి ఉన్న తరుణంలో అలసిపోయిన ప్రత్యర్థి నెట్టె నుంచి ఎదురైన దాడులను మనీషా తిరుగులేని డిఫెన్స్‌తో అడ్డుకుంది. రిఫరీ చివరి విజిల్ మోగించేవరకు ఒక్క పాయింట్ కూడా ప్రత్యర్థికి దక్కకుండా కాపాడుకుని 8-6 తేడాతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. విజయానంతరం మనీషా ఆనంద భాష్పాలతో రెజ్లింగ్ మ్యాట్‌ను ముద్దాడి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.

ఒకే టోర్నీలో ముగ్గురు ఫైనల్స్‌కు.. సరికొత్త రికార్డు

ఈ ఎడిషన్‌లో భారత మహిళా రెజ్లర్లు అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారతీయ మహిళలు ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి. గురువారం జరిగిన బౌట్లలో నీలం సిరోహి (50 కేజీలు), కాజల్ ధోచక్ (76 కేజీలు) రజత పతకాలు సాధించగా.. శుక్రవారం మనీషా స్వర్ణంతో మెరిసి భారత నిరీక్షణకు చారిత్రక ముగింపునిచ్చింది. మనీషా సాధించిన ఈ చిరస్మరణీయ విజయంపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us