ఆసియా కప్‌ను గెలిచిన ఉత్సాహంతో టీమిండియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌పై ఫోకస్ పెట్టింది. ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్‌ను గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ (12) టోర్నీలలో టీమిండియా పాల్గొంది. 1983, 2011లో రెండుసార్లు వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. 2023లోనూ వరల్డ్ కప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. వరల్డ్ కప్ ప్రిపరేషన్‌లో ఇప్పటికే ఆటగాళ్లు పూర్తిగా నిమగ్నమైపోయారు. ఇంతకీ ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. సచిన్ టెండుల్కర్ – 2278 పరుగులు
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. 1992 నుంచి 2011 వరకు ఆరు వరల్డ్ కప్‌లలో సచిన్ ఆడాడు. మొత్తం 45 మ్యాచ్‌లు ఆడిన సచిన్..56.95 పరుగుల సరాసరితో మొత్తం 2,278 పరుగులు సాధించాడు. 1996, 2003 వరల్డ్ కప్ మ్యాచ్‌లలోనూ టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు సచిన్. 2011 వరల్డ్ కప్‌లోనూ 9 మ్యాచ్‌లలో 482 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డు (6 సెంచరీలు) కూడా సచిన్ ఖాతాలోనే ఉంది.
ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ కూడా సచినే. ఆస్ట్రేలియా క్రికెటర్ రిక్కీ పాంటింగ్ రెండోస్థానంలో ఉన్నారు. పాంటింగ్ 42 ఇన్నింగ్స్‌లో 1742 పరుగులు సాధించాడు.
2. విరాట్ కోహ్లీ – 1030 పరుగులు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు మూడు వరల్డ్ కప్స్‌లో ఆడిన కోహ్లీ.. మొత్తం 26 మ్యాచ్‌లలో 1,030 పరుగులు (సరాసరి 46.81 పరుగులు) సాధించాడు. ఇందులో రెండు శతకాలు, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి.
3. సౌరవ్ గంగూలీ – 1006 పరుగులు
క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో బెంగాలీ టైగర్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. మూడు వరల్డ్ కప్స్‌లో ఆడిన గంగూలీ.. 1,006 పరుగులు సాధించాడు. 2003 వరల్డ్ కప్‌లో నమీబియా జట్టుపై సచిన్ టెండుల్కర్‌తో కలిసి గంగూలీ 244 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. తన వరల్డ్ కప్ కెరీర్‌లో గంగూలీ నాలుగు సెంచరీలు సాధించాడు. వరల్డ్ కప్‌లో బెంగాలీ టైగర్ 55.88 పరుగుల సరాసరిని నమోదుచేసుకున్నాడు. గంగూలీ నాయకత్వంలో టీమిండియా 2003 వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు చేరుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో గంగూలీ సేన ఓటమి చెందింది.
4. రోహిత్ శర్మ – 978 పరుగులు
వచ్చే వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మ టీమిండియాకు సారథ్యంవహించనున్నాడు. ఇప్పటి వరకు రెండు వరల్డ్ కప్‌లు ఆడిన హిట్ మ్యాన్.. కేవలం 17 ఇన్నింగ్స్‌లు ఆడి 65.20 సరాసరితో 978 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును రోహిత్ సమం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో అతి తక్కువ వ్యవధిలో ఆరు సెంచరీలు సాధించిన రికార్డు మాత్రం హిట్ మ్యాన్ పేరిటే ఉంది. వచ్చే వరల్డ్ కప్‌లో రోహిత్ సెంచరీల రికార్డును అధిగమించే అవకాశముంది.
5. రాహుల్ ద్రవిడ్ – 860 పరుగులు
క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఐదో భారత క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ఐదు వరల్డ్ కప్‌లు ఆడిన ఈ కర్ణాటక సొగసరి ఆటగాడు.. 61.43 పరుగుల సరాసరితో 860 పరుగులు సాధించాడు. గాడి తప్పుతున్న ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది టీమిండియాకు విజయాన్ని సాధించడంలో ద్రవిడ్ చాలా మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రికెట్ వార్తలు చదవండి..