WPL 2023: మారోసారి రికార్డులు బ్రేక్ అయ్యేనా.. ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధం.. ఢిల్లీలో ఎప్పుడంటే?

|

Jan 28, 2023 | 12:57 PM

Womens Premier League: మహిళల ప్రీమియర్ లీగ్ 2023 కోసం మీడియా హక్కులు, టీమ్‌లను ఇప్పటికే వేలం వేసిన సంగతి తెలిసిందే.

WPL 2023: మారోసారి రికార్డులు బ్రేక్ అయ్యేనా.. ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధం.. ఢిల్లీలో ఎప్పుడంటే?
Womens Ipl 2023
Follow us on

ఈ ఏడాది ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) కోసం బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంవత్సరం మొదటి రోజు నుంచి దీనికి సంబంధించిన పనులు ప్రారంభించింది. ఈ నెల ప్రారంభంలో మీడియా హక్కులను వేలం వేయగా, కొన్ని రోజుల క్రితం లీగ్‌లో పాల్గొనే జట్లను కూడా ప్రకటించింది. ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలం కోసం రంగం సిద్ధమవుతోంది. మహిళా ఆటగాళ్ల కోసం భారత్‌లో వేలం నిర్వహించడం ఇదే తొలిసారి.

గత కొన్నేళ్లుగా దేశంలో మహిళల ఐపీఎల్‌కు డిమాండ్ బాగా పెరిగింది. 2023 నుంచి మహిళల ఐపీఎల్‌ ప్రారంభమవుతుందని గతేడాది బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రకటించారు. ఇప్పుడు జట్లను నిర్ణయించారు. మరి ఏ టీమ్ జెర్సీలో ఏ సూపర్ స్టార్ కనిపిస్తారో చూడాలి.

ఫిబ్రవరిలో వేలం..

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్ల వేలానికి సంబంధించిన తేదీని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 10 లేదా 11న దేశ రాజధాని ఢిల్లీలో బోర్డు వేలం నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత స్టార్ ఆటగాళ్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా వేలంలో ఉండనున్నారు. ఈ వేలంలో వారి భవితవ్యం తేలనుంది.

ఇవి కూడా చదవండి

పోటీలో ఐదు ఫ్రాంచైజీలు..

ఐదు ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొంటాయి. రెండ్రోజుల క్రితం జరిగిన జట్ల వేలంలో ఫ్రాంచైజీల నగరాలు, జట్లను ఖరారు చేశారు. వేలం అనంతరం బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేస్తూ ఐదు జట్లకు రూ. 4669.99 కోట్ల బిడ్లు దాఖలయ్యాయని ప్రకటించాడు. అదానీ స్పోర్ట్స్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అహ్మదాబాద్ జట్టు కోసం రూ. 1289 కోట్లకు బిడ్ చేసింది. దీంతో ఆ జట్టు లీగ్‌లో అత్యంత ఖరీదైన జట్టుగా అవతరించింది. రిలయన్స్ సొంత కంపెనీ ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై జట్టు కోసం రూ.912.99 కోట్లు వెచ్చించింది.

పురుషుల ఐపీఎల్‌కు చెందిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహిళల ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు జట్టును రూ. 901 కోట్లకు కొనుగోలు చేసింది. JSW GMR క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ జట్టును రూ. 810 కోట్లకు కొనుగోలు చేయగా, కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ లక్నో మహిళల జట్టును సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ.757 కోట్లు వెచ్చించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..