Shree Charani : కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు.. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్

Shree Charani : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి సంచలనం సృష్టించింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు తీసి ఒకే ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Shree Charani : కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు..  మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్
Shree Charani

Updated on: Jun 22, 2026 | 6:13 AM

Shree Charani : మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైనప్పటికీ, టీమిండియా యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి మాత్రం తన అద్భుత బౌలింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఈ టోర్నమెంట్‌లో ఆడిన మొదటి మ్యాచ్ నుంచి ప్రత్యర్థి బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో తిప్పలు పెడుతున్న ఈ యంగ్ ప్లేయర్, కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.. మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 10 వికెట్లు తీసిన రెండో భారతీయ బౌలర్‌గా శ్రీ చరణి రికార్డు పుటల్లోకి ఎక్కింది.

సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అందరి మనసులను గెలుచుకుంది. ఈ హై-ప్రెజర్ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన శ్రీ చరణి, కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టింది. ఆమె చేసిన ఈ స్పిన్ మాయాజాలం వల్లే టీమిండియా ఈ మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకు తీసుకురాగలిగింది.

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఎడిషన్ శ్రీ చరణి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. టోర్నమెంట్‌లో ఆడిన మొదటి మ్యాచ్ నుంచి ఆమె ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లను సులభంగా పడగొడుతోంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన శ్రీ చరణి, ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మరింత ప్రమాదకరంగా మారి కేవలం 19 పరుగులకే 4 వికెట్లను పడగొట్టింది. ఇప్పుడు సౌతాఫ్రికాపై మరో 3 వికెట్లు తీయడంతో, కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఆమె ఖాతాలో 10 వికెట్లు చేరాయి. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది.

మహిళల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 10 వికెట్ల మేజిక్ ఫిగర్‌ను తాకిన రెండో భారతీయ బౌలర్‌గా శ్రీ చరణి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 2020 టీ20 వరల్డ్ కప్‌లో సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 5 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టారు. కానీ శ్రీ చరణి కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఆ రికార్డును సమం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఇంత వేగంగా 10 వికెట్లు తీసిన స్పిన్నర్ మరొకరు లేరు.

భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్ లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీ చరణి ఉన్న ఫామ్ చూస్తుంటే, రాబోయే మ్యాచ్‌ల్లో ఆమె మరో ఒక్క వికెట్ తీసినా.. టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్‌లో 10 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొట్టమొదటి భారతీయ బౌలర్‌గా నిలుస్తుంది. దీనితో పాటు మహిళల టీ20 ప్రపంచ కప్ ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు అమేలియా కెర్ (2024లో 15 వికెట్లు) పేరిట ఉంది. శ్రీ చరణ్ ఈ లీగ్ స్టేజ్, నాకౌట్ మ్యాచ్‌ల్లో మరో 6 వికెట్లు తీస్తే ఆ ప్రపంచ రికార్డు కూడా భారత్ ఖాతాలోకి రావడం ఖాయం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us