
Viral Video : భారత క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ ఉంటే సరదాకు కొదవ ఉండదు. మైదానంలో ఆయన స్టైలే వేరు. అప్పుడప్పుడు డ్యాన్స్ మూవ్స్‌తోనో, లేక సరదా యాక్టింగ్‌తోనో అభిమానులను అలరిస్తుంటాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో కూడా అలాంటి ఫన్నీ సందర్భం ఎదురైంది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను 270 పరుగులకు పరిమితం చేసిన సమయంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో కలిసి విరాట్ చేసిన ఓ సరదా కపుల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్, కార్బిన్ బాష్ వికెట్‌ను తీసి ఎనిమిదో షాక్ ఇవ్వగానే, వికెట్ సంబరాల్లో భాగంగా కుల్దీప్ చేయి పట్టుకుని విరాట్ సరదాగా డ్యాన్స్ స్టెప్స్ వేశాడు. ఈ డ్యాన్స్ సెలెబ్రేషన్, వారిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధాన్ని సూచించడమే కాక, భారత్ జట్టు 20 మ్యాచ్‌ల తర్వాత టాస్ గెలవడం కూడా ఈ ఉత్సాహానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో 4 వికెట్లు తీసుకుని సఫారీ బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేశారు. వీరిద్దరి ధాటికి దక్షిణాఫ్రికా జట్టు తమ పూర్తి 50 ఓవర్లు కూడా ఆడలేక 270 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ సిరీస్ 1-1తో సమం కావడంతో, ఈ మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
🔴 Virat Kohli + Kuldeep Yadav = Couple-dance celebration after the wicket!
Only Kohli can bring this energy 😂🔥#INDvsSA #ViratKohli #wicket pic.twitter.com/KnMnnwkyKP— Utkarsh Yadav (@utkarshyadav79) December 6, 2025
దక్షిణాఫ్రికా తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ ఒక్కడే పోరాటం చేసి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఈ మూడవ వన్డే మ్యాచ్‌లో అతను 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో ఆయన రెండు రికార్డులను సమం చేశాడు. ఇది అతని వన్డే కెరీర్‌లో 23వ సెంచరీ, దీని ద్వారా అతను వన్డేల్లో వికెట్ కీపర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును సమం చేశాడు. భారత్‌పై డి కాక్‌కు ఇది 7వ వన్డే సెంచరీ, దీంతో భారత్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన జాబితాలో ఆయన శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్యతో సమానం అయ్యాడు.