దిస్ ఆర్ దట్ (This or That) ఛాలెంజ్‌లో భాగంగా ఎదురైన కఠిన ప్రశ్నలకు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కుండబద్ధలు కొట్టినట్లు సమాధానమిచ్చాడు. కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లను కాదని.. భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చక్రవర్తిగా పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్న మీడియా కథనాల నేపథ్యంలో గంభీర్ ఈ సమాధానమివ్వడం ఆసక్తికర అంశం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు గంభీర్ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా చాలా ప్రశ్నలకు వెంటనే సమాధానమిచ్చిన గంభీర్.. భారత క్రికెట్‌లో షెహెన్‌షా (చక్రవర్తి) ఎవరు? అన్న ప్రశ్నకు కాస్త ఆలోచించి కోహ్లీ అని సమాధానమిచ్చారు.
కాగా భారత క్రికెట్‌లో బాద్‌షా ఆఫ్ క్రికెట్‌గా యువరాజ్ సింగ్ పేరును గంభీర్ ఎంచుకున్నాడు. అలాగే భారత క్రికెటర్లలో దబాంగ్ టైటిల్‌కు సచిన్ టెండుల్కర్ పేరు చెప్పాడు. కిలాడీ టైటిల్‌కు జస్‌ప్రీత్ బుమ్రా.. మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా రాహుల్ ద్రవిడ్‌ను ఎంచుకున్నాడు.
కాగా భారత క్రికెట్‌లో యాంగ్రీ యంగ్ మన్ ఎవరు? అన్న ప్రశ్నకు తానే అని గంభీర్ సమాధానమిచ్చాడు. ఆశ్చర్యకరంగా అన్ని సెగ్మెంట్లలో ఎక్కడా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ పేర్లను గంభీర్ ఎంచుకోకపోవడం ఆసక్తికరంగా మారింది.
వీడియో చూడండి..
Gautam Gambhir said – “Virat Kohli is the ‘ Shahenshah’ of Cricket”
Need new haters , old one become fan 👑
Video credit :- shefali bagga (Instagram) pic.twitter.com/ciILszbOzI
— ՏᎥ₫ 𝕩 (@_bad_boy17) September 11, 2024
ఐపీఎల్ 2023 సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య చెడిందంటూ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ వారిద్దరూ గత ఐపీఎల్ టోర్నీ సందర్భంగా క్లోజ్‌గా కనిపించారు. టీమిండియా కోచ్‌గా ఎంపికైన తర్వాత తొలి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన గంభీర్.. తనకు విరాట్ కోహ్లీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంచేశాడు.
కాగా బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమైన కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌తో మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో టీమిండియా మరింత బలంగా కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానుంది. రోడ్డు ప్రమాదంలో గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన రిషభ్ పంత్.. 20 మాసాల తర్వాత బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.