
మంగళగిరి: మహిళా యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారిని ఉమెన్ ప్రీమియర్ లీగ్, భారత మహిళా క్రికెట్ జట్టు వైపు నడిపించడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తలపెట్టిన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(WAPL) టీ-20 క్రికెట్ తొలి సీజన్ ప్రారంభమైంది.

మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-1 ప్రారంభోత్సవ వేడుకలకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా స్టేడియం ప్రాంగణానికి చేరుకున్న నారా బ్రాహ్మణికి ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఘనస్వాగతం పలికారు. అనంతరం డబ్ల్యూఏపీఎల్ ను ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తో కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్స వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మహిళా క్రికెటర్లకు ఇదో అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు.

భవిష్యత్ తరాలకు వీరంతా రోల్ మోడల్స్ గా నిలుస్తారని చెప్పారు. ప్రతిభ ఉండి అవకాశం వస్తే మహిళా క్రీడాకారిణులు అద్భుతంగా రాణిస్తారని తెలిపారు. మంగళగిరి వేదికగా యువ మహిళా క్రికెటర్లకు అవకాశం కల్పించిన ఏసీఏ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ డబ్ల్యూఏపీఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఫ్రాంచైజీ విధానంలో రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న డబ్ల్యూఏపీఎల్ టీ-20 క్రికెట్ పోటీల్లో నాలుగు జట్లు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి.

మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో 7 రోజుల పాటు 13 మ్యాచ్ లు జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. సాయంత్రం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది.

డబ్ల్యూఏపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారా బ్రాహ్మణికి నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ డి.విష్ణుతేజ, ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వైఎస్ రంగనాథ్ పాల్గొన్నారు.