
VVS Laxman: బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది. భారత జట్టుకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు గాయాల పాలై రిహాబిలిటేషన్ కోసం ఈ సెంటర్‌లో చేరుతుండటం, అక్కడ కోలుకుని వెళ్లిన కొంతకాలానికే మళ్లీ గాయపడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ CoEకి మద్దతుగా నిలిచారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. CoE పాత్ర కేవలం గాయపడిన ఆటగాళ్లకు చికిత్స అందించడం లేదా రిహాబిలిటేషన్‌కే పరిమితం కాదని, ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచేందుకు సహాయపడటంలో దీని పాత్ర మరింత పెద్దదని స్పష్టం చేశారు.
హర్షిత్ రాణా ఫిట్‌నెస్ వివాదం
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన సమయంలో యంగ్ పేసర్ హర్షిత్ రాణా బరువు దాదాపు 97 కిలోగ్రాములు ఉందనే వార్తలు ఇటీవల సంచలనం సృష్టించాయి. సరైన ఫిట్‌నెస్ లేకుండానే అతనిని ఆడేందుకు అనుమతించడం వల్ల మైదానంలో దిగిన తర్వాత మళ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడి తిరిగి CoE బాట పట్టాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి సహా దాదాపు 13 నుంచి 14 మంది కీలక ఆటగాళ్లు ఈ సెంటర్‌లో రిహాబ్ ప్రక్రియలో ఉన్నారు. బుమ్రా, సాయి సుదర్శన్ శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌కు కూడా గాయాల కారణంగా దూరమయ్యారు.
యో-యో స్థానంలో కొత్తగా బ్రోంకో టెస్ట్
ఆటగాళ్ల ఫిట్‌నెస్ నిబంధనలపై లక్ష్మణ్ వివరాలు వెల్లడించారు. సుదీర్ఘమైన సిరీస్‌లు లేదా సిరీస్ మధ్యలో ఆటగాళ్లకు యో-యో టెస్ట్ నిర్వహించడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఆయన తెలిపారు. అందుకే ఆటగాళ్ల మ్యాచ్ ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి అడ్రియన్ రూపొందించిన బ్రోంకో టెస్ట్‌ను తీసుకువచ్చినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఒక ఆటగాడు మైదానంలో ఆడేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాడో మేనేజ్‌మెంట్‌కు స్పష్టమైన సమాచారం లభిస్తుందని తెలిపారు.
బుమ్రా, సుదర్శన్ గాయాలపై క్లారిటీ
జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. వారిద్దరినీ వేర్వేరుగా పరీక్షించిన తర్వాతే ఆడేందుకు అనుమతిస్తామని చెప్పారు. CoE, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతోందని తెలిపారు. గాయాలు అనేవి ప్రొఫెషనల్ క్రీడాకారుల కెరీర్‌లో ఒక భాగమని, దానికోసం ఏ ఒక్క విభాగాన్నో లేదా వ్యక్తినో బలిపశువును చేయడం లేదా నిందించడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శకులకు స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..