
T20 World Cup 2026 : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఆతిథ్య దేశమైన భారత్, అమెరికా క్రికెట్ జట్టుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి వీసా చిక్కులు మొదలయ్యాయి. అమెరికా జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ఆటగాళ్లు వరల్డ్ కప్‌లో ఆడతారా లేదా అనే సందిగ్ధంలో యూఎస్ఏ క్రికెట్ బోర్డు పడిపోయింది.
అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, అలీ ఖాన్, షాయన్ జహంగీర్, మహ్మద్ మోసిన్, ఎహ్సాన్ ఆదిల్ అనే నలుగురు ఆటగాళ్లు పాకిస్థాన్‌లో జన్మించారు. ప్రస్తుతం వారు అమెరికా పౌరులుగా ఉన్నప్పటికీ, భారత వీసా నిబంధనల ప్రకారం పాకిస్థాన్ మూలాలున్న వారు ఆ దేశ పాస్‌పోర్ట్ వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. “పాకిస్థాన్ మూలాలున్న మా నలుగురికి భారత వీసా దొరకలేదు, దీనివల్ల మేము వరల్డ్ కప్‌కు దూరం అయ్యేలా ఉన్నాం” అని స్టార్ పేసర్ అలీ ఖాన్ ఒక వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలాంటి వీసా సమస్యలు క్రికెటర్లకు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లాండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లకు కూడా భారత్ వచ్చే సమయంలో ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ సిరాజ్ అహ్మద్‌కు వీసా రావడంలో బాగా ఆలస్యమైంది. కేవలం అమెరికానే కాకుండా జింబాబ్వే, కెనడా, నెదర్లాండ్స్ వంటి జట్లలో కూడా పాకిస్థాన్ మూలాలున్న ఆటగాళ్లు ఉండటంతో, ఆ జట్లు కూడా ఇప్పుడు టెన్షన్‌లో ఉన్నాయి. ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకుని వీసాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..