Virat Kohli: సచిన్ ‘100 సెంచరీల రికార్డు’ను కోహ్లీ బద్దలు కొడతాడా? ఇదీ లెక్క

విరాట్ కోహ్లీ శతకాల మోతమోగిస్తున్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ శతకాల రికార్డుకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం అన్ని ఫార్మెట్లలో కోహ్లీ 86 అంతర్జాతీయ శతకాలతో ఉన్నారు. ప్రస్తుత శతకాల రేటు కొనసాగితే సచిన్ రికార్డును కోహ్లీ ఎప్పుడు అధిగమించగలరనే దానిపై ఆసక్తికరమైన గణిత అంచనా ఇదిగో..

Virat Kohli: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడా? ఇదీ లెక్క
Virat Kohli Vs Sachin Tendulkar

Updated on: Sep 30, 2026 | 3:11 PM

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంది. విరాట్ కోహ్లీ వరుసగా అద్భుత ప్రదర్శనలు చేస్తూ.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ.. సచిన్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును కోహ్లీ అధిగమిస్తాడా? అనే చర్చ మరోసారి మొదలైంది. ఇటీవల వెస్టిండీస్‌-భారత్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శతకం సాధించడంతో కోహ్లీ మొత్తం అంతర్జాతీయ శతకాల సంఖ్య 86కు చేరింది.

సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 100 శతకాలు సాధించారు. అంటే సగటున ప్రతి 6.64 మ్యాచ్‌లకు ఒక శతకం సాధించినట్లు లెక్క. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 593 మ్యాచ్‌ల్లో 86 శతకాలు నమోదు చేశారు. ఈ లెక్క ప్రకారం ప్రతి 6.55 మ్యాచ్‌లకు ఒక శతకం సాధిస్తున్నారు. అంటే మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌లో శతకాల రేటు పరంగా కోహ్లీ ప్రస్తుతం సచిన్ కంటే కాస్త మెరుగైన స్థానంలోనే ఉన్నారు.

సచిన్ రికార్డును సమం చేయడానికి కోహ్లీకి మరో 14 శతకాలు అవసరం. సచిన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాలంటే 15 శతకాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టెస్ట్‌లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ ప్రస్తుత శతకాల రేటు ప్రతి 6.55 మ్యాచ్‌లకు ఒక శతకాన్ని పరిగణలోకి తీసుకుంటే.. మరో 15 శతకాల కోసం సుమారు 98 మ్యాచ్‌లు అవసరమవుతాయని గణాంకాల ఆధారంగా అంచనా. అయితే ఇది కేవలం ప్రస్తుత రేటును భవిష్యత్ మ్యాచ్‌లకు వర్తింపజేసిన గణిత అంచనా మాత్రమే.

వన్డే క్రికెట్ విషయానికి వస్తే కోహ్లీ శతకాల రేటు మరింత ఆసక్తికరంగా ఉంది. సచిన్ 463 వన్డేల్లో 49 శతకాలు సాధించగా.. ఒక శతకానికి సగటున 9.45 మ్యాచ్‌లు పట్టాయి. కోహ్లీ 315 వన్డేల్లో 55 శతకాలు సాధించారు. అంటే ప్రతి 5.73 వన్డేలకు ఒక శతకం సాధించినట్లు లెక్క. ఈ గణాంకం వన్డేల్లో కోహ్లీ శతకాల వేగం ఎంత ఎక్కువగా ఉందో చూపిస్తుంది.

2028 నాటికి ఎన్ని వన్డే శతకాలు?

భారత్ రాబోయే రెండేళ్లలో సుమారు 40 వన్డేలు ఆడుతుందని అంచనా వేసి, కోహ్లీ తన ప్రస్తుత 5.73 మ్యాచ్‌లకు ఒక శతకం రేటును కొనసాగిస్తే.. ఆ 40 మ్యాచ్‌ల్లో దాదాపు 7 శతకాలు సాధించే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ప్రస్తుతం ఉన్న 55 వన్డే శతకాలు.. 2028 చివరి నాటికి సుమారు 62కు చేరే అవకాశముంటుంది.

సచిన్ రికార్డును ఎప్పుడు బ్రేక్ చేస్తాడు..?

ప్రస్తుతం కోహ్లీ శతకాల వేగం కొనసాగి.. ప్రతి ఏడాది సుమారు 20 వన్డేలు ఆడతారని భావిస్తే.. 15 శతకాలు సాధించడానికి మరో 4.9 సంవత్సరాలు పట్టే అవకాశముంది. అంటే ప్రస్తుత గణాంకాలను మాత్రమే ఆధారంగా తీసుకుంటే..  37 ఏళ్ల వయస్కుడైన కోహ్లీ సుమారు 42 ఏళ్ల వయసులో సచిన్ 100 శతకాల రికార్డును అధిగమించే అవకాశం ఉన్నట్లు గణిత అంచనా. అయితే భవిష్యత్‌లో మ్యాచ్‌ల సంఖ్య, ఫామ్, ఫిట్‌నెస్, గాయాలు, జట్టు షెడ్యూల్ వంటి అనేక అంశాలు ఈ లెక్కలను మార్చగలవు.

Loading...
Unable to load recommendations.
Follow Us