Virat Kohli : కోహ్లీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. విజయ్ హజారే ట్రోఫీలో కింగ్ మరో వేట

Virat Kohli :విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇదొక అదిరిపోయే న్యూస్. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పబోతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో ఢిల్లీ తరపున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 208 పరుగులు చేసి భీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు.

Virat Kohli : కోహ్లీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. విజయ్ హజారే ట్రోఫీలో కింగ్ మరో వేట
Virat Kohli

Updated on: Dec 29, 2025 | 4:52 PM

Virat Kohli :విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు ఇదొక అదిరిపోయే న్యూస్. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పబోతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో ఢిల్లీ తరపున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 208 పరుగులు చేసి భీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు రైల్వేస్‌తో జరగబోయే ఆరో రౌండ్ మ్యాచ్‌లో కోహ్లీ మరోసారి బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లీతో పాటు యువ సంచలనం యశస్వి జైస్వాల్ కూడా ముంబై తరపున కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.

క్రిక్‌బజ్ సమాచారం ప్రకారం.. జనవరి 6వ తేదీన ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరగబోయే కీలక పోరులో విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు కోహ్లీకి ఇది మంచి ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. విశేషమేమిటంటే.. కోహ్లీ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ ఆడింది కూడా ఈ రైల్వేస్ జట్టుపైనే. ఇప్పుడు మళ్ళీ అదే జట్టుతో తలపడటం కోహ్లీకి ఒక అరుదైన అనుభూతిని ఇవ్వనుంది. విరాట్‌తో పాటు ముంబై జట్టు తరపున యశస్వి జైస్వాల్ కూడా మూడు మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది.

ఈ విజయ్ హజారే సీజన్‌లో కోహ్లీ ఆడిన తీరు చూస్తుంటే పాత కోహ్లీ గుర్తొస్తున్నాడు. ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ బాదాడు. ఇది కోహ్లీకి లిస్ట్-A క్రికెట్‌లో 58వ సెంచరీ. ఇదే ఇన్నింగ్స్ ద్వారా లిస్ట్-A కెరీర్‌లో అత్యంత వేగంగా (330 ఇన్నింగ్స్‌ల్లో) 16,000 పరుగుల మైలురాయిని దాటిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత గుజరాత్ మీద కూడా 77 పరుగులతో రాణించి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు.

విజయ్ హజారే ట్రోఫీలో ఈసారి సీనియర్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. టోర్నీ ప్రారంభంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై తరపున రెండు మ్యాచ్‌లు ఆడి అలరించారు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా ముంబై తరపున మూడు మ్యాచ్‌లు ఆడనున్నారు. టీమిండియా వన్డే జట్టులో శుభ్‌మన్ గిల్ ఉండటంతో జైస్వాల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రావడం కష్టమే. అందుకే దేశవాళీ క్రికెట్ ఆడి తన రిథమ్‌ను కాపాడుకోవాలని జైస్వాల్ భావిస్తున్నాడు.

మొత్తానికి జనవరి 11న కివీస్‌తో పోరుకు ముందు కోహ్లీ రైల్వేస్‌పై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ జట్టుకు ఈ విజయం చాలా కీలకం కాబట్టి, కోహ్లీ బ్యాట్ ఝుళిపిస్తే ఢిల్లీకి తిరుగుండదు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.