
Vaibhav Suryavanshi : బీహార్ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దేశవాళీ క్రికెట్‌లో మరోసారి తన సత్తా చాటాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన బాధను మర్చిపోయేలా, విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి మ్యాచ్‌లోనే విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సరికొత్త రికార్డులను తిరగరాశాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ (ధోనీ సొంతూరు) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బీహార్ తరపున ఓపెనర్‌గా వచ్చిన వైభవ్, అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేయగా, ఇందులో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ సాధించిన రెండో వేగవంతమైన సెంచరీగా ఇది రికార్డులకు ఎక్కింది. కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు కూడా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న తరుణంలో ఈ 14 ఏళ్ల కుర్రాడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
చరిత్ర సృష్టించిన వండర్ కిడ్
వైభవ్ సూర్యవంశీ కేవలం సెంచరీ వేగంతోనే కాకుండా తన వయసుతోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. 13 ఏళ్లకే ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన అతను, ఇప్పుడు 14 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
పాక్ ఓటమికి సమాధానం
కొన్ని రోజుల క్రితమే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 26 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ నిరాశను తన బ్యాటింగ్‌తో చెరిపివేస్తూ, సీనియర్ దేశవాళీ టోర్నీలో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటం విశేషం. కేవలం వైట్ బాల్‌లోనే కాకుండా, ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతను సెంచరీ బాది ఫామ్‌లో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..