Vaibhav Sooryavanshi: టీమిండియాలో చోటు కోసం వైభవ్ కొత్త ప్లాన్.. తెరవెనుక ఆ స్కిల్‌పై స్పెషల్ ఫోకస్

Vaibhav Sooryavanshi: టీమిండియాలో తన స్థానాన్ని పక్కా చేసుకోవాలని 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో ఇప్పటికే సత్తా చాటిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు బౌలింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు. ప్రతిరోజూ సాధన చేస్తున్నాడని స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే వెల్లడించారు.

Vaibhav Sooryavanshi: టీమిండియాలో చోటు కోసం వైభవ్ కొత్త ప్లాన్.. తెరవెనుక ఆ స్కిల్‌పై స్పెషల్ ఫోకస్
Vaibhav Sooryavanshi

Updated on: Oct 31, 2026 | 8:56 AM

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు టీమిండియాలో తన స్థానాన్ని పక్కా చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా అవకాశాలు దక్కకపోవడంతో వైభవ్ ప్రస్తుతం జట్టులో తన పాత్రను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాలుగో టీ20లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడంతో వైభవ్‌కు అవకాశం లేకుండా పోయింది.

బ్యాటింగ్‌లో అదరగొట్టిన వైభవ్

ఇషాన్ కిషన్ గాయంతో దూరమైన సమయంలో రెండో, మూడో టీ20ల్లో వైభవ్‌కు ఆడే అవకాశం వచ్చింది. రెండో మ్యాచ్‌లో 4 పరుగులకే వెనుదిరిగిన అతడు, మూడో టీ20లో మాత్రం 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో కలిసి వేగంగా పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి ఆరు ఓవర్లలోనే 100కు పైగా పరుగులు జోడించి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఇంత మంచి ప్రదర్శన చేసినా తర్వాతి మ్యాచ్‌లో వైభవ్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు జట్టులో తన అవకాశాలను పెంచుకునేందుకు మరో నైపుణ్యంపై దృష్టి పెట్టాడు.

బౌలింగ్‌పైనా ప్రత్యేక శ్రద్ధ

వైభవ్ ప్రస్తుతం బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే వెల్లడించారు. వైభవ్ బౌలింగ్‌పై చాలా ఆసక్తి చూపిస్తున్నాడని, ప్రతిరోజూ సాధన చేస్తున్నాడని చెప్పారు. తెరవెనుక ఈ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడని తెలిపారు. అతడికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కూడా తగిన అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని బహుతులే వివరించారు.

టీ20ల్లో ఒకటి, రెండు ఓవర్లు వేయగలిగితే..

వైభవ్ బౌలింగ్‌లో మరింత మెరుగైతే టీ20ల్లో ఒకటి లేదా రెండు ఓవర్లు వేసే అవకాశం రావచ్చని బహుతులే అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వన్డేల్లోనూ బౌలింగ్ చేసే స్థాయికి ఎదగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. వైభవ్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడని, తన బౌలింగ్ రొటీన్‌ను క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నాడని చెప్పారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడే ఆటగాడిగా ఎదిగితే జట్టులో అతడి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

సంజూ శాంసన్ ప్రదర్శనపైనా చర్చ

మరోవైపు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ ప్రదర్శన కూడా చర్చనీయాంశంగా మారింది. తొలి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సంజూ, ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు, ఈ సిరీస్‌లో మాత్రం నిలకడ చూపించలేకపోతున్నాడు. భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల్లో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వైభవ్‌కు మరో అవకాశం వస్తుందా అన్నది చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us